Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం తాడ్డానిపల్లి శివారులోని 161వ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వేగంగా వచ్చిన లారీ బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్‌ఈఎల్ (BHEL) ఎంఐజీ ప్రాంతానికి చెందిన బీరప్పయాదవ్ (40), తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన బాపూజీ (38) కలిసి మోటారు బైక్ (TS 15EZ 5308) పై జోగిపేట వైపు నుంచి సంగారెడ్డి వైపు బయలుదేరారు. తాడ్డానిపల్లి టోల్ ప్లాజా సమీపానికి రాగానే, వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ (R50 GA 3894) వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ బైక్ పైనుంచి రోడ్డుపై పడిపోయారు.
లారీ వెనుక టైర్లు బీరప్పయాదవ్ తలపై నుంచి వెళ్లడంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న బాపూజీ రోడ్డు పక్కకు పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాద స్థలమంతా రక్తసిక్తంగా మారి భయానక వాతావరణం నెలకొంది. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Sangareddy Road Accident: పోలీసుల చర్యలు - కేసు నమోదు
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన బాపూజీకి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బీరప్పయాదవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని పుల్కల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పుల్కల్ ఎస్ఐ నల్లా విశ్వజన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు

