Medak Municipality Funds Controversy: మెదక్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం (మున్సిపాలిటీ) లో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలు, కోట్ల రూపాయల నిధుల వినియోగంపై పలు అనుమానాలు, విమర్శలు తలెత్తుతున్నాయి.
మున్సిపల్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిందనే ప్రచారం పట్టణ ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల పేరిట జరుగుతున్న నిధుల మళ్లింపు, పారదర్శకత లేకపోవడంపై విపక్ష కౌన్సిలర్లు మరియు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ప్రియంబుల్‌ల వెనుక మర్మమేంటి? – పెరిగిన పన్నుల భారం
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అధికారులు ప్రవేశపెడుతున్న ప్రత్యేక 'ప్రియంబుల్‌ల' వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు కొందరు ప్రజాప్రతినిధుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కౌన్సిలర్లు కోరుతుంటే, అధికారులు మాత్రం “పట్టణంలో పన్నుల వసూళ్లు పెంచండి” అంటూ ప్రజలపై భారం మోపే సూచనలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల జీతభత్యాల చెల్లింపుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనడం పాలనా లోపాలకు అద్దం పడుతోంది.
Medak Municipality Funds Controversy: మీడియాపై ఆంక్షలు – కమిషనర్ గైర్హాజరు
మరోవైపు మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు, నిధుల గోల్‌మాల్ బయటపడకుండా ఉండేందుకే మీడియా ప్రతినిధులపై పరిమితులు విధిస్తున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ కవరేజ్‌లకే అనుమతులు ఉంటే, మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా సమాచారాన్ని నియంత్రిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వివరణ కోరేందుకు మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది

