Rythu Ashirvada Sabha : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన 'రైతు ఆశీర్వాద సభ' వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే విధంగా అత్యంత సంచలన ప్రకటన చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 2029 మే-జూన్ నెలల మధ్యే జరుగుతాయని ఆయన కాలపరిమితిని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ వల్ల తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏకంగా 182 స్థానాలకు పెరుగుతుందని సీఎం వెల్లడించారు. అలా పెరిగే మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ (INC) ఒంటరిగానే రికార్డు స్థాయిలో 117 సీట్లు గెలుచుకుని, తిరిగి అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. “భద్రాద్రి రాముడిపై ఆన.. ఇది ఖమ్మం ప్రజల సాక్షిగా చెబుతున్న మాట” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ శపథం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కల్వకుంట్ల కుటుంబానికి బహిరంగ సవాల్.. 'కౌరవ వంశం'పై సమరశంఖం
ఇదే బహిరంగ సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత ఘాటుగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని తమ సొంత జాగీరులా భావించిన కల్వకుంట్ల కుటుంబం ఇక్కడ ‘కౌరవ వంశం’లా మారి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ.. “కేసీఆర్ కాచుకో.. నువ్వు వస్తావో, నీ కొడుకు (కేటీఆర్), నీ అల్లుడు (హరీష్ రావు), నీ బిడ్డ (కవిత) ఎవరొస్తారో రండి.. మీ అందరినీ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం” అంటూ బహిరంగంగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ గడ్డపై ఆ కౌరవ వంశాన్ని రాజకీయంగా శాశ్వతంగా పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ సైనికులు నిద్రపోరని, కార్యకర్తలంతా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కంకణబద్ధులై పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

