Nepal Floods:నేపాల్‌ను ముంచెత్తిన వినాశకర హఠాత్ వరదల (Flash Floods) ధాటికి మృతుల సంఖ్య 547కు చేరగా, సుమారు 1,500 మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. గల్లంతైన వారిలో 320 మంది భారతీయ పౌరులు ఉన్నారు.
ఈ తీవ్ర విషాదకర ఘటనలో అస్సాంలోని హోజాయ్ (Hojai) జిల్లాకు చెందిన శతదళ్ నాథ్ (Shatadal Nath) అనే యువకుడు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. శతదళ్ నాథ్ హోజాయ్ జిల్లా దబోకా (Doboka) పరిధిలోని హిందూ బ్లాక్ గ్రామానికి చెందినవారు.
ఘటన ఎలా జరిగింది?
బాధితుని కుటుంబ సభ్యులు మరియు అధికారులు వెల్లడించిన వివరాలు.శతదళ్ నాథ్ ఎనిమిది నెలల క్రితం ఉపాధి నిమిత్తం నేపాల్ వెళ్లారు. అక్కడ ఒక పవర్ సప్లై కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ విధులు ముగించుకుని ఆయన తన గదికి వచ్చి నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి వరద నీరు ఉప్పెనలా విరుచుకుపడింది. ప్రవాహ ఉధృతికి శతదళ్ నాథ్ ఉంటున్న గది పూర్తిగా కొట్టుకుపోయింది. ఆయనతో పాటు ఒకే భవనంలో ఉంటున్న మరొక 14 మంది కార్మికులు కూడా ఈ నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు.

Nepal Floods:తప్పించుకున్న సహోద్యోగి.. తీవ్ర ఆందోళనలో కుటుంబం
దబోకాకే చెందిన ఆయన సహోద్యోగి గౌతమ్ దాస్ నాటి షిఫ్ట్ డ్యూటీలో ఉండటంతో ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత నేపాల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది గౌతమ్‌ను సురక్షితంగా రెస్క్యూ చేశారు. గౌతమ్ దాస్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, శతదళ్ నాథ్ క్షేమసమాచారం కోసం ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తోంది. శతదళ్ నాథ్ బంధువు సుమిత్ దాస్ మాట్లాడుతూ.. తమకు ఇప్పటివరకు కంపెనీ సూపర్వైజర్ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదని, సమాచారం దొరికితే చెబుతామని మాత్రమే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

