Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
7 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు రద్దు.. నీరుగారుతున్న పథకం!

7 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు రద్దు.. నీరుగారుతున్న పథకం!

వార్త 3 days ago

Upadhi Hami Job Cards: తెలంగాణలో గ్రామీణ ప్రాంత పేద ప్రజల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) లక్ష్యం క్రమక్రమంగా నీరుగారుతోంది.

కేంద్ర ప్రభుత్వం పథకం ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని మారుస్తూ రోజురోజుకూ కొత్త నిబంధనలను తీసుకురావడంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోతున్నారు. గత ఆరేళ్ల (2019-20 నుంచి 2024-25 వరకు) వ్యవధిలోనే తెలంగాణలో ఏకంగా ఏడు లక్షలకు పైగా జాబ్ కార్డులు రద్దు కావడం గమనార్హం.

ఆరేళ్లలో 22.28 లక్షల మంది కూలీల పేర్లు రద్దు

కేంద్రం తెచ్చిన కఠిన నిబంధనల వల్ల ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో జాబ్ కార్డులు, లక్షల సంఖ్యలో కూలీల పేర్లను అధికారులు జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఆరేళ్ల కాలంలో తెలంగాణలో ఏకంగా 7 లక్షల జాబ్ కార్డులతో పాటు 22.28 లక్షల మంది కూలీల పేర్లను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రద్దు చేశారు. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 5.10 లక్షల కార్డులను తొలగించారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో కార్డులను తొలగించలేదని స్వయంగా ఉన్నతాధికారులే చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 52.22 లక్షల జాబ్ కార్డులు ఉండగా, అందులో 1.07 కోట్ల మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. అయితే, వీరిలో కేవలం 30.59 లక్షల జాబ్ కార్డుదారులకు చెందిన 49.99 లక్షల మంది సభ్యులు మాత్రమే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనులకు వెళ్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. మిగిలిన సగం మంది కూలీలు ఉపాధి హామీ పనులకు పూర్తిగా దూరమయ్యారు.

Upadhi Hami Job Cards: రెండు పూటల ఫోటో’ నిబంధన

ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని షరతులు కూలీలకు శాపంగా మారాయి.

  • యాప్ ఫోటోల నిబంధన: పని ప్రదేశంలో ఉదయం ఒకసారి, మధ్యాహ్నం భోజనం తర్వాత మరోసారి కచ్చితంగా ఆన్‌లైన్ యాప్ ద్వారా ఫొటో తీయాలనే కఠిన నిబంధన కూలీలను ఈ పనులకు దూరం చేస్తోంది.
  • తక్కువ వేతనాలు: బయట మార్కెట్‌లో కూలీ రేట్లు భారీగా పెరుగుతున్నప్పటికీ, దానికి అనుగుణంగా ఉపాధి హామీలో వేతనాలు పెరగకపోవడంతో కూలీలు ఈ పనులపై ఆసక్తి చూపడం లేదు. దీనికంటే ఇతర ప్రైవేట్ పనులకు వెళ్లడమే లాభదాయకమని భావిస్తున్నారు.
  • పట్టణీకరణ, వలసలు: గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరగడం, కూలీలు మరణించడం ఒక కారణమైతే.. చాలా గ్రామాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం కావడం వల్ల కూడా సాంకేతికంగా జాబ్ కార్డుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అధికారులు విశ్లేషిస్తున్నారు
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha