Nepal Rescue Operation: మెరుపు వరదలతో మట్టిదిబ్బగా మారిన నేపాల్‌లో రక్షణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదలు సంభవించి పది రోజులు గడుస్తున్నా, కొందరు బాధితులు సజీవంగా బయటపడుతున్న ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
రసువా జిల్లాలోని త్రిశూలి-3 ‘ఎ’ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు నేపాల్ ఆర్మీ అహోరాత్రులు శ్రమించింది. దాదాపు తొమ్మిది రోజులు గడవడంతో వారు బతికే ఉన్నారనే ఆశలు క్షీణిస్తున్న తరుణంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. అండర్ గ్రౌండ్ సొరంగం నుంచి ఇద్దరు కార్మికులను ఆర్మీ సిబ్బంది సురక్షితంగా బయటకు వెలికితీశారు.

Nepal Rescue Operation: 170 మీటర్ల లోతులో రెస్క్యూ ఆపరేషన్
మొదటి బాధితుడిని తమ భుజాలపై మోస్తూ రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. అతడిని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA)లో మెకానికల్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల సంజయ్ సాహ్‌గా గుర్తించారు. ఆ వెంటనే త్రిశూలి-3 ‘ఎ’ ప్రాజెక్ట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల కబీర్ మహర్జన్‌ను కూడా సొరంగం నుంచి బయటకు తీశారు. వీరిద్దరూ సొరంగం లోపల దాదాపు 170 మీటర్ల లోతులో లభించారు. ప్రథమ చికిత్స అనంతరం సంజయ్ సాహ్‌ను త్రిశూలిలోని ఆర్మీ బ్యారక్స్‌కు, కబీర్ మహర్జన్‌ను కాఠ్మాండులోని సైనిక ఆసుపత్రికి తరలించారు. సొరంగం లోపల పాకే క్రమంలో వారిద్దరి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.
ప్రాణాలు నిలిపిన ‘ఎయిర్ పాకెట్స్’
మట్టి, బురదతో పూర్తిగా మూసుకుపోయిన సొరంగం లోపల సాహ్, మహర్జన్ తొమ్మిది రోజుల పాటు ప్రాణాలతో ఉండటానికి అక్కడర్పడిన ‘ఎయిర్ పాకెట్స్’ (గాలి బుడగలు) కారణమని భావిస్తున్నారు. ఈ ఎయిర్ పాకెట్లు వారికి శ్వాస ఆడటానికి సహాయపడి ఉండొచ్చని రెస్క్యూ టీమ్‌లు వెల్లడించాయి. సొరంగం లోపల ఇలాంటి ఇతర పాకెట్లలో మరికొందరు కార్మికులు కూడా సజీవంగా ఉండవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి.
ఉగ్రరూపం దాల్చిన నదులు.. విరిగిన మంచు కొండలు
ఆగస్టు 26న నేపాల్, చైనా ఆక్రమిత టిబెట్ సరిహద్దులోని మంచు కొండలు విరిగిపడటంతో భారీ వరదలు సంభవించాయి. శిథిలాలు, బురద ప్రవాహం వల్ల భోటే కోషి, త్రిశూలి నదీ లోయలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నదుల ప్రవాహ ప్రాంతంలో ఉన్న పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతుండటంతో, అండర్‌గ్రౌండ్ గాలి పాకెట్స్ వల్ల మరికొందరు కార్మికులు బతికే అవకాశం ఉందనే నమ్మకంతో అధికారులు జలవిద్యుత్ సొరంగాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
నేపాల్ వరదలు: అర్నాల్డ్ డిక్స్ పర్యవేక్షణలో టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్

