Telangana Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నకిలీ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగానే అత్యాధునికమైన 9 రకాల భద్రతా ఫీచర్లతో కొత్త ఆహార భద్రతా (రేషన్) కార్డులను జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో రూపకల్పన
ఈ కొత్త రేషన్ కార్డుల రూపకల్పనలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. కార్డు ముందు భాగంలో సంబంధిత జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంతకం ఉంటుంది. అలాగే వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్‌ను ప్రత్యేకంగా ముద్రిస్తున్నారు. కార్డుపై ఉండే ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అనే అక్షరాలు ఉబ్బెత్తుగా ఉండటం దీని ప్రత్యేకత. చేతితో తాకినప్పుడు ఈ అక్షరాలను స్పష్టంగా గుర్తించవచ్చు. సాంకేతిక పరిభాషలో దీనిని ‘రిలీఫ్ టెక్స్ట్’ టెక్నాలజీగా పిలుస్తారు.
Telangana Ration Cards: కంటికి కనిపించని రహస్య భద్రతా ఫీచర్లు
సాధారణ కంటికి స్పష్టంగా కనిపించని మరిన్ని అద్భుతమైన ఫీచర్లను కూడా ఈ కార్డుల్లో పొందుపరిచారు. కార్డుపై ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అనే వాక్యాన్ని అతి సూక్ష్మమైన అక్షరాలతో పదేపదే ముద్రిస్తారు. వీటిని సాధారణంగా చూడలేం, కేవలం భూతద్దం సహాయంతో మాత్రమే చూడగలం. అలాగే కార్డును వెలుతురుకు ఎదురుగా పట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన వాటర్‌మార్క్ స్పష్టంగా గోచరిస్తుంది.
నకిలీల కట్టడికి డ్యూయల్ హిడెన్ ఇమేజ్
ఈ కొత్త కార్డుల్లో ‘డ్యూయల్ హిడెన్ ఇమేజ్’ అనే మరో అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడుతున్నారు. ఈ కార్డును ఒక ప్రత్యేక కోణంలో పరిశీలించినప్పుడు ‘జీవో టీజీ ఒరిజినల్’ వంటి రహస్య గుర్తులు ప్రత్యక్షమవుతాయి. ఇన్ని రకాల అధునాతన భద్రతాంశాలు ఉండటం వల్ల ఈ కొత్త రేషన్ కార్డులను నకిలీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ పకడ్బందీ చర్యల ద్వారా పీడీఎస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది.
Epaper: epaper.vaartha.com

