AP Govt Good News : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలకు గ్రామీణ బ్యాంకు ఎంతో మేలు చేకూర్చే సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. సాధరణంగా స్వయం సహాయక సంఘాల్లో కొత్తగా రుణం పొందాలన్నా లేదా 'రిపీట్ డోస్' లోన్ (మరో విడత రుణం) మంజూరు కావాలన్నా కనీసం 10 మంది సభ్యులు ఉండాలనే నిబంధన అమల్లో ఉండేది.
అయితే, సభ్యుల అనుకోని మరణాలు, ఉపాధి నిమిత్తం జరిగే వలసలు లేదా ఇతర కారణాల వల్ల సంఘంలో సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గితే, బ్యాంకు రుణాల మంజూరు ఆగిపోయి మిగిలిన సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించిన గ్రామీణ బ్యాంక్, ఇకపై కనీసం 8 మంది యాక్టివ్ సభ్యులు ఉన్నా సరే రిపీట్ డోస్ లోన్ మంజూరు చేయడానికి మార్గదర్శకాలలో కీలక మార్పులు చేసింది. దీనివల్ల రాష్ట్రంలోని వేలాది పొదుపు సంఘాలకు కొత్త ఊపిరి లభించినట్లయింది.

లోన్ మంజూరు నిబంధనలు మరియు నిబంధనల విధింపు
ఈ నూతన సడలింపు ద్వారా లోన్ పొందాలనుకునే సంఘాలు కొన్ని నిర్దిష్ట షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటిది, సంఘానికి గతంలో ఉన్న పాత బకాయిలు ఏవీ ఉండకూడదు (అన్ని పాత ఈఎంఐలు సక్రమంగా చెల్లించి ఉండాలి). అలాగే, 8 మంది సభ్యులతో రుణం పొందినప్పటికీ, రాబోయే 6 నెలల వ్యవధిలో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేస్తూ సంఘం సభ్యుల సంఖ్యను తిరిగి 10కి పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటు వల్ల సభ్యులు తక్కువయ్యారనే నెపంతో ఆర్థికంగా ఆగిపోకుండా, సంఘాలు తమ వ్యాపారాలను, ఉపాధి మార్గాలను నిరంతరాయంగా కొనసాగించుకునే సద్భాగ్యం కలుగుతుంది. నిబంధనలను సక్రమంగా పాటించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకింగ్ అధికారులు సూచిస్తున్నారు.

