Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆలంపూర్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత

ఆలంపూర్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత

వార్త 2 weeks ago

Jogulamba Temple Alampur: ఆలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అభివృద్ధితో పాటు, రైల్వే స్టేషన్ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.6.07 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం సందర్శించారు. ముందుగా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దర్శనీయ స్థలాల సమాచారంతో ఏర్పాటు చేసిన బోర్డులను తిలకించారు.

ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్ వద్ద నిర్వాహకులతో మాట్లాడి అనంతరం టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ఇప్పటికే రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర వెల్లడించారు. ఆలయాల అంతర్గత అభివృద్ధి, సంరక్షణకు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కూడా అవసరమైన నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Read Also : Veldurthi Medak Road: వెల్దుర్తి నుండి మెదక్ కలెక్టరేట్ వరకు BRS నిరసన

 Centre accords special priority to Alampur’s development.

Jogulamba Temple Alampur: మౌలిక వసతుల కల్పన, పెండింగ్ పనుల సమీక్ష

ఆలంపూర్ అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ బస్‌స్టాండ్, బ్రిడ్జి, రోడ్లు తదితర కొన్ని మౌలిక వసతుల పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం వలన సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఆయా పనులను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఆలంపూర్ అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను సమగ్రంగా సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కేంద్ర మంత్రి కోరారు. ఆలంపూర్‌ను మరింత అభివృద్ధి చేసి భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని రహదారులు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం, రవాణా తదితర మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలన్నారు.

తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో ఆధునికీకరిస్తున్నామని, 2027 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆలంపూర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

జోగులాంబ అమ్మవారి ఆధ్యాత్మికత, ఆలంపూర్ శక్తిపీఠం విశిష్టత ప్రతిబింబించేలా రైల్వే స్టేషన్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే జోగులాంబ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు ఆలంపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తూ సింగిల్ లైన్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్లను ట్రిపుల్ లైన్లుగా, అవసరమైన ప్రాంతాల్లో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఆలంపూర్ శాసనసభ్యులు విజేయుడు, దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha