Andhra Popcorn : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం నూతన మైలురాళ్లను తాకుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇందులో భాగంగా ఏలూరు జిల్లా ముసునూరులో ఏర్పాటు చేసిన గౌర్మే పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని దేశీయ నాన్-జీఎంఓ (Non-GMO) పాప్‌కార్న్ మొక్కజొన్న (Andhra Popcorn ) హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు.
రైల్వే స్టేషన్లలో పాప్‌కార్న్, అరకు కాఫీ విక్రయ కేంద్రాలు :
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పిన ఆలోచన ఎంతో బాగుందని ప్రశంసించారు. అరకు కాఫీ తరహాలోనే ఆంధ్రా పాప్‌కార్న్‌ను కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేస్తామని ప్రకటించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా రైల్వే స్టేషన్లలో పాప్‌కార్న్, అరకు కాఫీ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసేలా రైల్వే మంత్రితో చర్చిస్తామని తెలిపారు.

ఇకపై ‘పాప్‌కార్న్’ అనగానే ప్రతి ఒక్కరికీ ఏలూరు జిల్లాలోని ముసునూరు ప్రాంతం గుర్తుకువస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కేవలం సంప్రదాయ సాగుతో సరిపెట్టకుండా, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు బ్రాండింగ్ ద్వారా రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వేలాది మంది రైతులు జన్యుమార్పిడి లేని హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
వ్యవసాయ ఉత్పత్తులకు తగిన విలువ జోడిస్తేనే సంపద సృష్టి జరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని సీఎం స్పష్టం చేశారు. అరకు కాఫీ, ఆంధ్రా పాప్‌కార్న్ వంటి స్వదేశీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ వేదిక ద్వారా పునరుద్ఘాటించారు.

