Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై!

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై!

వార్త 1 week ago

Ramireddy Pratap Kumar Reddy: కావలి నియోజకవర్గంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. కావలి శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తనపై మోపిన అవినీతి నిందారోపణలను ఏ ఒక్కటైనా నిరూపిస్తే తాను తక్షణమే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని కావలి నియోజకవర్గ వైసీపి ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.

కావలి పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. నియోజకవర్గంలో జరుగుతున్న పలు గ్రావెల్ దందాలను, అలాగే అమృత్ (Amrut) తాగునీటి పథకానికి సంబంధించిన కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోల ఆధారాలను ఎల్‌ఈడీ (LED) స్క్రీన్‌పై మీడియా సాక్షిగా ప్రదర్శించి సంచలనం సృష్టించారు.

Read Also: Nellore Yogandhra Programme 2026:నెల్లూరులో 'యోగాంధ్ర-2026' శంఖారావం!

విజిలెన్స్ విచారణకు సిద్ధం - అడ్డుకుంటున్నది ఎవరు?

అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు అమృత్ పథకం నిధులు రూ. 14 కోట్లు మింగేశానని ఎమ్మెల్యే దగుమాటి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందని, దమ్ము ధైర్యం ఉంటే ఆ నిధులపై తక్షణమే విజిలెన్స్‌ ఎంక్వైరీ (Vigilance Inquiry) వేయించి నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా (24 నెలలు) ఇప్పటివరకు ఆ కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. పైగా ఎమ్మెల్యేకు తెలియకుండా వారి సొంత పార్టీ నాయకులే అంతర్గతంగా విజిలెన్స్‌ విచారణ వేయిస్తే.. అధికారులను, కూటమి నేతలను పంపి ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కావలి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే కనీసం ఒక్క మంచి పని కూడా చేయలేదని, మహిళలు వద్దు మొర్రో అని నెత్తీనోరు బాదుకుంటున్నా జనావాసాల మధ్య బార్లు ఏర్పాటు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ. 100 కోట్ల ముసునూరు స్కామ్ - కాళ్లు కడుగుతా!

ముసునూరు మనీ స్కామ్‌లో ఏకంగా రూ. 100 కోట్ల భారీ అవినీతికి పాల్పడింది ప్రస్తుత ఎమ్మెల్యేనేనని ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “ఆ రూ. 100 కోట్ల దోపిడీ సొమ్మును దొంగిలించకుండా ప్రజలకు తిరిగి ఇచ్చేస్తే.. కావలి పట్టణంలోని చారిత్రాత్మక యానాదిరెడ్డి విగ్రహం సాక్షిగా నీ కాళ్లు కడిగి తలమీద చల్లుకుంటా” అని సవాల్ విసిరారు.

గత వైసీపి ప్రభుత్వ హయాంలో 126 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందని ఎమ్మెల్యే గగ్గోలు పెడుతున్నారని, మరి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అందులో కనీసం 50 ఎకరాలనైనా ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆ భూ కబ్జారాయుళ్లంతా ఎమ్మెల్యేకు నెలవారీ కప్పం కట్టి ఆయన చుట్టూనే తిరుగుతున్నారని ఆరోపించారు. ఒకవేళ ఆ కబ్జా భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నా సరే.. తాను ఎమ్మెల్యే కాళ్లు కడిగేందుకు సిద్ధమని సవాల్‌ను పునరుద్ఘాటించారు.

Ramireddy Pratap Kumar Reddy: నియోజకవర్గంలో రౌడీయిజం.. పెరిగిన దౌర్జన్యాలు!

ఎమ్మెల్యే వచ్చిన ఈ కొద్ది కాలంలోనే కావలి నియోజకవర్గంలో రౌడీయిజం, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నేతను బహిరంగంగా బెదిరించారని, మరో సీనియర్‌ రాజకీయనాయకుడిని అసభ్య పదజాలంతో బూతులు తిట్టారని మండిపడ్డారు. టిడిపి కావలి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్ సుబ్బానాయుడును మానసిక వేధింపులతో ఏకంగా కాటికే పంపించారని ఆరోపించారు. పేపర్లవారిపాలెం గ్రామానికి తాగేందుకు మంచి నీటిని అడిగినందుకు ఒక సొంత పార్టీ టీడీపీ కార్యకర్తనే చెంప చెల్లుమనిపించిన చరిత్ర మీదని దుయ్యబట్టారు. “మాటలు ఎక్కువ.. పని తక్కువ” అని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడే మీ పనితీరుపై క్లాస్ తీసుకున్నా బుద్ధి రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం చేసే ఆరోపణలకు అధికారపార్టీ నేతలు సమాధానం చెప్పాలి కానీ, పెయిడ్ బ్యాచ్‌లను పెట్టి మాట్లాడించడం విడ్డూరంగా ఉందన్నారు.

60 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తా..

జువ్వలదిన్నె బోట్ల వ్యవహారంలో అమాయక మత్స్యకారులను అడ్డుపెట్టుకుని బీద సోదరులపై ఎమ్మెల్యే కుట్రలు పన్నారని, ఆ దొంగ రికార్డులన్నీ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు వద్దకు చేరాయని, రాబోయే రోజుల్లో ఈ అక్రమ కుట్రలన్నీ బయటపడతాయన్నారు. తన అవినీతి, దోపిడీలు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే తనపై తప్పుడు మర్డర్ కేసులు (హత్యానేరం కేసులు) పెట్టించారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే కేవలం రెండున్నర సంవత్సరాల (30 నెలల) ముచ్చటగా సగం నియోజకవర్గానికే పరిమితమయ్యారని, ఆయనకు అల్లూరు, దగదర్తి మండలాలకు వెళ్లే మొహం, పరిస్థితి లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో పొరపాటున కూటమి తరఫున దగుమాటికి మళ్లీ టికెట్‌ వస్తే.. కావలిలో తాను 60 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం తథ్యమని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రసవత్తర మీడియా సమావేశంలో వైసిపి కావలి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

నెల్లూరులో 'యోగాంధ్ర-2026' శంఖారావం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha