Anantapur: అనంతపురం జిల్లాలో వెనుకబడిన, కరువు ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన కళ్యాణదుర్గం ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న ఆర్థిక నేరాలు, అక్రమాల కారణంగా మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.
ఒకప్పుడు ప్రశాంతతకు ప్రతీకగా భావించిన ఈ ప్రాంతం పేరు వరుస ఆర్థిక అక్రమాల కారణంగా ప్రతికూల ప్రచారంలో నిలుస్తోందనే అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల వ్యవహారం కళ్యాణదుర్గం కేంద్రంగా సాగినట్లు విచారణలో బయటపడిన విషయం తెలిసిందే. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో స్టాంపులలో అంకెల మార్పులు చేసి నకిలీ పత్రాలు తయారు చేసిన ఘటన అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ ఘటన మరవకముందే, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో భారీ విదేశీ నిధులు ఉన్నట్లు చూపిస్తూ నకిలీ బ్యాంకు పత్రాలు, రబ్బర్ స్టాంపులు, రిజర్వ్ బ్యాంక్ లేఖలను తయారు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Read also: AP High Court : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు
యూనియన్ బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసిన విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోషల్ మీడియా పరిచయాల ద్వారా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుని, కొందరు యువకులు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇందుకోసం పలువురి పేర్లపై బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో కళ్యాణదుర్గం చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అలాగే, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు కూడా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి లక్షల్లో లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ శాఖల పనితీరుపై మరింత పర్యవేక్షణ అవసరమని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు, అక్రమ ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖలు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

