CJP : సిజెపి (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ప్రతినిధి సౌరవ్ దాస్ మరియు ఇతర నిరసన నిర్వాహకులపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) కింద కేసు నమోదు చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన న్యాయవాది రింకీ ఛటర్జీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా 12 ఏళ్ల బాలికలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దీప్కే, దాస్‌లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అసలు అంత చిన్న వయసు ఉన్న చిన్నారులను ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు ఎందుకు తీసుకువచ్చారో నిర్వాహకులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సున్నితమైన వయసున్న పిల్లలను ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టినందుకు నిర్వాహకులపై పోక్సో చట్టంతో పాటు ఇతర క్రిమినల్ సెక్షన్ల కింద ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాలని కోరారు.
CJP Role విదేశీ శక్తుల ప్రమేయం, విచారణకు డిమాండ్
ఈ ఆందోళన కార్యక్రమం వెనుక కేవలం విద్యార్థుల సమస్యలు మాత్రమే కాకుండా, ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర దాగి ఉందనే సందేహాలను అడ్వకేట్ రింకీ ఛటర్జీ వ్యక్తం చేశారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు కొందరు బ్రోకర్లు, దేశవ్యతిరేక శక్తులు (యాంటీ నేషనల్స్) మరియు విదేశీ ఏజెన్సీలు దీనికి నిధులు సమకూరుస్తున్నాయని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. చిన్న పిల్లలను కవచంగా వాడుకుంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థ ఆర్థిక మూలాలపై లోతైన దర్యాప్తు జరగాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసు అధికారులను కోరారు.

