Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఒక యువ అభిమాని కన్నీటి గాథను విని చలించిపోయిన ఆయన, ఆ యువకుడి క్రికెట్ కలను నిజం చేయడానికి తాను పూర్తి మద్దతు ఇస్తానని మాట ఇచ్చారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్ (TG20 League) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ హృద్యమైన సంఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు విజయ్ రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

స్టేడియంలో ఎమోషనల్ అయిన అభిమాని
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ, ముగింపు మ్యాచ్‌ను తిలకించేందుకు స్టేడియానికి విచ్చేశారు. ఈ క్రమంలో తన అభిమాన నటుడిని అంత దగ్గరగా చూసిన ఒక యువకుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ.. "అన్నా.. నేను చాలా అద్భుతంగా క్రికెట్ ఆడతాను. కానీ, ముందుకు వెళ్లడానికి నాకు ఎలాంటి సపోర్ట్, ఆర్థిక ప్రోత్సాహం లేవు. నువ్వే నన్ను ఆదుకోవాలి అన్నా" అంటూ విజయ్‌ను వేడుకున్నాడు.
Vijay Deverakonda: దగ్గరకు తీసుకుని ఓదార్చిన రౌడీ హీరో
సాధారణంగా ఇలాంటి భారీ జనం ఉన్న ప్రదేశాల్లో సెలబ్రిటీలు బాడీగార్డ్స్ సాయంతో ముందుకు సాగిపోతుంటారు. కానీ, విజయ్ దేవరకొండ మాత్రం ఆ యువకుడి మాటలకు కరిగిపోయారు. వెంటనే ఆ అభిమానిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అంతటితో ఆగకుండా అతని పేరు, ఊరు, కుటుంబ నేపథ్యం వంటి వివరాలను ఎంతో ఓపికగా అడిగి తెలుసుకున్నారు. క్రికెట్‌లో రాణించాలనే అతని లక్ష్యానికి తాను ఖచ్చితంగా అండగా ఉంటానని, అవసరమైన సాయం అందిస్తానని అందరి ముందూ మనస్ఫూర్తిగా ప్రామిస్ చేశారు.
విజయ్ దేవరకొండ గతంలోనూ 'దేవరశాంటా' (DevaraSanta) పేరుతో ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా వందలాది మంది అభిమానులను ఉచితంగా విహారయాత్రలకు పంపడం, పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఒక సామాన్య ఔత్సాహిక క్రికెటర్ ప్రతిభను గుర్తించి సపోర్ట్ చేస్తానని ముందుకు రావడంతో విజయ్ దేవరకొండపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

