Abhishek Banerjee: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎంపీ అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా అమ్తలాలో ఉన్న పార్టీ కార్యాలయ కూల్చివేత వ్యవహారంలో గతంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తామని న్యాయస్థానం తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

వాదనల వాయిదా కోరడంపై కోర్టు అసహనం
ఈ కేసులో వాదనలు వినిపించేందుకు అభిషేక్ బెనర్జీ తరఫు న్యాయవాది పదేపదే గడువు కోరడంపై జస్టిస్ సువ్రా ఘోష్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజు కూడా వాదనలకు సిద్ధంగా లేకపోతే మధ్యంతర స్టేను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
Abhishek Banerjee: అక్రమ నిర్మాణం ఆరోపణలు మరియు కూల్చివేత యత్నం
అమ్తలాలోని టీఎంసీ కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించారంటూ సుశాంత్ మండల్ అనే వ్యక్తి మే 17న అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర యంత్రాంగం, జూలై 18, 19 తేదీల్లో ఆ కార్యాలయ కూల్చివేత పనులను ప్రారంభించింది.
నోటీసులు ఇవ్వకుండా ఏకపక్ష చర్యలంటూ హైకోర్టును ఆశ్రయించిన టీఎంసీ
తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా కూల్చివేత చర్యలకు దిగారంటూ టీఎంసీ వర్గాలు హైకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ వివాదాస్పద ఆస్తి అభిషేక్ బెనర్జీ కుటుంబానికి చెందిన ‘లీప్స్ అండ్ బౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పేరు మీదే రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం.

