Telangana : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అత్యంత దూకుడుగా వ్యవహరించారు. ప్రతిష్టాత్మకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరు అడ్డుకున్నా వదిలిపెట్టేది లేదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
“మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడినా, ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరించినా వెనక్కి తగ్గేదే లేదు.. అడ్డువచ్చిన వారిని మూసీలోనే వేసి తొక్కుతాం” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మూసీ నదిని పునరుజ్జీవింపజేసి, హైదరాబాద్‌తో పాటు పరివాహక ప్రాంతాల ప్రజల భవిష్యత్తును మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం.. ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ
ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రకటనలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ (SLBC – శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టును వంద శాతం పూర్తి చేసి తీరుతామని నల్గొండ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతకుముందు, రాష్ట్రంలో రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు గానూ ప్రతిష్టాత్మక ‘హైబ్రీడ్ యాన్యుటీ మోడల్’ (HAM) విధానంలో నిర్మించనున్న రహదారుల పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించి ఈ రోడ్ల నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

