Tirumala: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ఈ ఏడాది కనుల పండుగైన అరుదైన అవకాశం రానుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు సెప్టెంబర్‌లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 15 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – పూర్తి షెడ్యూల్
మొదటగా సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 14న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 19న అత్యంత ప్రాముఖ్యమైన గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు కొనసాగుతుంది. అలాగే సెప్టెంబర్ 22న మహారథోత్సవం, సెప్టెంబర్ 23న చక్రస్నానంతో సాలకట్ల ఉత్సవాలు ముగుస్తాయి.
సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహన సేవల పూర్తి షెడ్యూల్:
సెప్టెంబర్ 15 (మొదటి రోజు): సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
సెప్టెంబర్ 16 (రెండో రోజు): ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం.
సెప్టెంబర్ 17 (మూడో రోజు): ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం.
సెప్టెంబర్ 18 (నాలుగో రోజు): ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం.
సెప్టెంబర్ 19 (ఐదో రోజు): ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ (సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు).
సెప్టెంబర్ 20 (ఆరో రోజు): ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజ వాహనం.
సెప్టెంబర్ 21 (ఏడో రోజు): ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం.
సెప్టెంబర్ 22 (ఎనిమిదో రోజు): ఉదయం 7 గంటలకు రథోత్సవం (మహారథం), రాత్రి అశ్వ వాహనం.
సెప్టెంబర్ 23 (తొమ్మిదో రోజు): ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Tirumala: అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు – టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు
ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత, అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా టీటీడీ నిర్వహించనుంది. ఈ వివరాలను టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రెండు బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తోంది.

