Anil Chakravarthy: దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ (Adobe) నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన అనిల్ చక్రవర్తి అడోబ్ కొత్త ప్రెసిడెంట్ మరియు సీఈవో (CEO) గా నియమితులయ్యారు.
గత 18 ఏళ్లుగా అడోబ్ సీఈవోగా వ్యవహరిస్తున్న శంతను నారాయణ్ ఆ పదవి నుంచి తప్పుకోనుండటంతో అనిల్ చక్రవర్తి ఈ బాధ్యతలను చేపడుతున్నారు. డిసెంబర్ 1న అనిల్ చక్రవర్తి అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు మరియు అడోబ్ డైరెక్టర్ల బోర్డులో కూడా చేరనున్నారు. అదే సమయంలో శంతను నారాయణ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతూ నాయకత్వ మార్పిడి ప్రక్రియలో సహకరిస్తారు.
Anil Chakravarthy: ఐఐటీ గ్రాడ్యుయేట్ నుంచి టెక్ దిగ్గజ సీఈవో వరకు అనిల్ చక్రవర్తి ప్రస్థానం

అనిల్ చక్రవర్తి ఐఐటీ బనారస్ హిందూ యూనివర్సిటీ (IIT-BHU) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మక ఎంఐటీ (MIT) నుంచి ఎంఎస్ మరియు పీహెచ్‌డీ పట్టాలు పొందారు. గతంలో సిమాంటెక్, వెరిసైన్, మెకిన్సీ వంటి ప్రముఖ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2015 నుంచి 2020 వరకు ‘ఇన్ఫర్మాటికా’ (Informatica) సంస్థ సీఈవోగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం ఎఫ్‌ఐఎస్ (FIS) సంస్థ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. 2020 జనవరిలో అడోబ్‌లో చేరిన అనిల్, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆర్కెస్ట్రేషన్, వరల్డ్‌వైడ్ ఫీల్డ్ ఆపరేషన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అడోబ్ ఉత్పత్తుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను తీసుకురావడంలో అనిల్ కీలక పాత్ర పోషించారు. జెన్‌స్టూడియో (GenStudio), అడోబ్ సీఎక్స్ ఎంటర్‌ప్రైజ్, వర్క్‌ఫ్రంట్, సెమ్రష్ కొనుగోళ్లలో భాగస్వామ్యమయ్యారు. ఏఐ సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో అడోబ్ మార్కెట్ పోటీని ఎదుర్కొంటోంది. కంపెనీ షేరు ధర పడిపోతున్న నేపథ్యంలో బాధ్యతలు చేపడుతున్న అనిల్ చక్రవర్తి ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి.

