Sanjay Kumar Jain: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అగ్ర నాయకత్వంలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. సంస్థ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD) సంజయ్ కుమార్ జైన్ తన పదవి నుంచి తప్పుకున్నారు.
వ్యక్తిగత కారణాల రీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆయన రాజీనామాను ఆమోదించగా, ఈ నిర్ణయం జూలై 20వ తేదీ నుండి అమలులోకి రానుంది.

జూలై 20 వరకు విధుల్లోనే.. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం
ఈ పరిణామానికి సంబంధించి ఐఆర్‌సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా అధికారిక వివరాలను అందించింది. రైల్వే మంత్రిత్వ శాఖ నుండి జూన్ 22న తమకు ఈ రాజీనామా ఆమోద లేఖ అందినట్లు సంస్థ పేర్కొంది. కొత్త అధికారికి బాధ్యతల బదిలీ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు వీలుగా జూలై 20 వరకు సంజయ్ జైన్ సీఎండీ హోదాలోనే సేవలందిస్తారు. ఆ తర్వాత ఈ అదనపు బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.
Sanjay Kumar Jain: సంజయ్ జైన్ హయాంలో ఐఆర్‌సీటీసీ నవరత్నగా ప్రస్థానం
సంజయ్ కుమార్ జైన్ 1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) సీనియర్ అధికారి. ఆయన 2024 ఫిబ్రవరి 14న ఐఆర్‌సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో సంస్థ వ్యాపారపరంగా, పరిపాలనాపరంగా అద్భుతమైన మైలురాళ్లను అందుకుంది. ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ హోదా 'మినీరత్న' స్థాయి నుండి ప్రతిష్ఠాత్మక 'నవరత్న' స్థాయికి పెరిగింది. అలాగే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) వర్గీకరణలో ‘షెడ్యూల్-బి’ కేటగిరీ నుండి ‘షెడ్యూల్-ఎ’ గ్రూప్‌కు ఈ ప్రభుత్వ రంగ సంస్థ ప్రమోషన్ సాధించింది.
“నా పదవీకాలంలో నాతో కలిసి పనిచేసి, సంస్థ విజయాల్లో భాగస్వాములైన రైల్వే శాఖ అధికారులకు, సిబ్బందికి నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఐఆర్‌సీటీసీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని నమ్ముతున్నాను” అని సంజయ్ జైన్ తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నారు.
read also:

