Reliance : చమురు, టెలికామ్, రిటైల్ రంగాల్లో సంచలనాలు సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇప్పుడు కన్స్యూమర్ ఉత్పత్తుల విభాగంలో మరో కీలక అడుగు వేసింది.
రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఐస్ క్రీమ్ వ్యాపారంలోకి అధికారికంగా అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ‘బాంబే క్రీమెరీ’ (Bombay Creamery) బ్రాండ్ పేరుతో ప్రీమియం కేటగిరీ ఐస్ క్రీమ్‌లను మార్కెట్లోకి తేనున్నట్లు వెల్లడించింది. స్వచ్ఛమైన పాలు, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచ స్థాయి ఐస్ క్రీమ్ అనుభూతిని భారతీయులకు అందిస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

రూ. 10లకే ప్రీమియం ఐస్ క్రీమ్: దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ
వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ సంస్థ రూ. 10 ప్రారంభ ధరకే ఈ ఐస్ క్రీమ్‌లను అందుబాటులోకి తేస్తుండటం విశేషం. అతి తక్కువ ధరలో అత్యంత ప్రామాణికమైన, వైవిధ్యమైన ఫ్లేవర్లను అందించడం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అముల్ (Amul), క్వాలిటీ వాల్స్ (Kwality Wall’s), మదర్ డెయిరీ, హావ్‌మోర్ వంటి దిగ్గజ బ్రాండ్లకు రిలయన్స్ గట్టి పోటీని ఇవ్వనుంది. తనకున్న విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్, జియోమార్ట్ సప్లై చైన్ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకూ బాంబే క్రీమెరీ ఉత్పత్తులను వేగంగా చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది.

