Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అకాల వర్షాలకు అతలాకుతలమైన అరటి తోటలు!

అకాల వర్షాలకు అతలాకుతలమైన అరటి తోటలు!

వార్త 2 weeks ago

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ప్రకృతి మరోసారి అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా పడింది. ఏడాది పొడవునా చెమటోడ్చి, కన్నబిడ్డలా పెంచుకున్న అరటి పంట కోతకు సిద్ధమైన వేళ అకాల వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడి రైతులను కోలుకోలేని తీవ్ర నష్టాల్లోకి నెట్టేశాయి.

సోమవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి ఒక్క రాత్రిలోనే వేలాది అరటి చెట్లు వేళ్లతో సహా నేలకొరిగి, రైతుల కష్టాన్ని క్షణాల్లో మట్టిలో కలిపేశాయి.

Read Also: Srisailam Chenchu Free Sparsha Darshanam:చెంచు గిరిజనులకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనం!

కోతకు 45 రోజుల ముందే ముదిగల్లులో వాన బీభత్సం

కళ్యాణదుర్గం పరిధిలోని ముదిగల్లు గ్రామంలో ఈ అకాల వర్షం సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. కోతకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఈసారి ఎలాగైనా మంచి దిగుబడి వస్తుందని ఇక్కడి రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యం వారి ఆశలన్నింటినీ ఒక్కసారిగా ఛిన్నాభిన్నం చేసింది. పంటను చూసి ఆనందపడాల్సిన అన్నదాతలు.. ఇప్పుడు నేలకూలిన తోటల మధ్య నిలబడి కన్నీరు పెట్టుకునే గుండెకోత మిగిలింది.

రూ. 60 లక్షలకు పైగా నష్టం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు

ముదిగల్లు గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు నాలుగు నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో అరటి సాగు చేశారు. ఎకరాకు లక్షల రూపాయలు వెచ్చించి ఎరువులు, పురుగుల మందులు, కార్మిక వ్యయం భరిస్తూ పంటను ప్రాణప్రదంగా సంరక్షించారు. ఇందులో ఒక్కో రైతు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అయితే భారీ గాలులకు అరటి మొక్కలు నిలువునా విరిగిపోవడంతో మొత్తం రూ. 60 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. "ఇంకా నెలన్నర రోజులు గడిస్తే పంట చేతికొచ్చేది, అప్పులు తీర్చుకుని కుటుంబాన్ని నిలబెట్టుకుంటామనుకున్నాం. కానీ ఒక్క రాత్రిలోనే అంతా తుడిచిపెట్టుకుపోయింది" అంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Kalyandurg: అధికారులు ఆదుకోవాలని గిరిజన, స్థానిక రైతుల డిమాండ్

ఇప్పటికే పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఒకవైపు, ఇప్పుడు చేతికొచ్చిన పంట చేజారడం మరోవైపు తమను వెంటాడుతున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. దెబ్బతిన్న తోటలను పరిశీలించిన గ్రామస్తులు రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వ్యవసాయ అధికారులు వెంటనే ముదిగల్లు గ్రామానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక సహాయం లేదా పరిహారం ప్రకటించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha