Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో ఉన్నా అన్నదాతపైనే ధ్యాస!

అమెరికాలో ఉన్నా అన్నదాతపైనే ధ్యాస!

వార్త 5 days ago

MLA T Harish Rao: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తాను ఎక్కడ ఉన్నా తన ధ్యాస, ఆలోచన అంతా అన్నదాతల కష్టాలపైనేనని మరోసారి నిరూపించుకున్నారు.

తన కుమారుడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమం కోసం ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు, అక్కడ నుంచే తెలంగాణలోని రైతుల ఇబ్బందులపై తక్షణమే స్పందించారు. సిద్దిపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉందనే విషయం తన దృష్టికి రావడంతో, ఆయన అమెరికా నుంచే అటు రాష్ట్ర మంత్రులకు, ఇటు జిల్లా అధికారులకు ఫోన్ చేసి అన్నదాతల అవస్థలను వివరించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు హరీష్ రావు అమెరికా నుండి నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. గత నలభై రోజులకు పైగా పొద్దుతిరుగుడు రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లు చేపట్టకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనితో పాటు కొనుగోళ్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జొన్న రైతులను ఆదుకునేందుకు తక్షణమే జొన్నల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు మండుటెండల్లో రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తోందని మంత్రుల వద్ద హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 Farmers waiting with their harvested paddy and sunflower crops under the sun at a government purchasing center in Telangana

మరోవైపు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసిన హరీష్ రావు(MLA T Harish Rao), క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై సుదీర్ఘంగా చర్చించారు. ధాన్యం నిల్వ చేయడానికి ఎదురవుతున్న గోడౌన్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ గోడౌన్లతో పాటు ప్రైవేట్ గోడౌన్లను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత సమస్యను వెంటనే పరిష్కరించి ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను, మిల్లర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ కొనుగోళ్లలో వేగాన్ని పెంచాలన్నారు. రోజుల తరబడి ఎండల్లో ఉండటం వల్ల రైతులు అస్వస్థతకు గురవుతున్నారని, ఒకవేళ హఠాత్తుగా వర్షాలు మొదలైతే కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయి రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని కలెక్టర్‌ను అప్రమత్తం చేశారు. తూకం మరియు తరుగు విషయంలో మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కేసీఆర్ పై యెన్నం స్క్రోలింగ్ పాయింట్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha