AM/NS : ఉక్కు తయారీలో ఉత్పన్నమయ్యే ఇనుప ఖనిజ వ్యర్థాలను (ఐరన్ ఓర్ టెయిలింగ్స్ - IOTs) సుస్థిర వ్యవసాయానికి ఉపయోగపడే విలువైన వనరులుగా మార్చేందుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ - ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR-IARI) చేతులు కలిపాయి.
పారిశ్రామిక వ్యర్థాల పునర్వినియోగం, వనరుల పరిరక్షణ మరియు సర్క్యులర్ ఎకానమీ (వలయాకార ఆర్థిక వ్యవస్థ) సాధనే లక్ష్యంగా ఇరు సంస్థలు న్యూఢిల్లీలో ఒక కీలక అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి. ఇనుప ఖనిజ వ్యర్థాల్లో సిలికా, ఐరన్ ఆక్సైడ్లు, అల్యూమినా, కాల్షియం, మెగ్నీషియంతో పాటు పలు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నట్లు ప్రాథమిక ప్రయోగాల్లో తేలింది. వరి, గోధుమ మరియు కూరగాయల పంటల ఉత్పత్తిని పెంచడానికి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యర్థాలు ఎంతో సమర్థవంతంగా తోడ్పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు లబ్ధి: దీర్ఘకాలిక శాస్త్రీయ పరిశోధనలు
న్యూఢిల్లీలోని IARI తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని కిరండుల్‌లో ఉన్న AM/NS ఇండియా బెనిఫీసియేషన్ ప్లాంట్ సమీపంలో పలు సీజన్‌ల పాటు ఈ దీర్ఘకాలిక శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించనున్నారు. ఈ వ్యర్థాల వల్ల నేల ఆరోగ్యం, పంట దిగుబడి మరియు పర్యావరణంపై పడే ప్రభావాన్ని క్షుణ్ణంగా అంచనా వేసి పటిష్టమైన ఆధారాలను సేకరించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. రసాయన ఎరువుల దిగుమతిని తగ్గించడం, సారహీనమైన నేలల్లో ఇనుము లోపాన్ని అధిగమించడం మరియు పంటల్లో పోషక విలువలను పెంచే బయోఫోర్టిఫికేషన్‌కు ఈ పరిశోధన దోహదపడుతుందని ICAR-IARI ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ భూపిందర్ సింగ్ తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలను దీర్ఘకాలం నిల్వ చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తూ పర్యావరణ రక్షణ మరియు సుస్థిర వ్యవసాయానికి ఈ ఒప్పందం బాటలు వేస్తుందని AM/NS ఇండియా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

