Disqualification : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పుపై స్పందించారు. కోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, తీర్పు పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు.
హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి చట్టపరమైన ముందడుగుపై స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

ఏ క్షణమైనా ఉపఎన్నికకు సిద్ధం: పోటీ ఏ పార్టీ నుంచో సస్పెన్స్!
తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా తాను ఎదుర్కొనేందుకు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తనకు కొత్తేమీ కాదని, ‘మళ్లీ పోరాడతా.. మళ్లీ గెలుస్తా’ అని విశ్వాసం ప్రకటించారు. అయితే, రాబోయే ఉపఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీ బి-ఫామ్‌పై లేదా ఏ వర్గం తరఫున రేసులో ఉంటాననే అంశంపై వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నికలో దానం నాగేందర్ వ్యూహం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

