AIADMK : తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి నాయకత్వానికి వ్యతిరేకంగా 36 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ అసమ్మతి వర్గం పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌లో రహస్య సమావేశాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం ఈ తిరుగుబాటుకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో పార్టీలో అసంతృప్తి పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎడప్పాడి పళనిసామి ఒంటెద్దు పోకడలు, వరుస పరాజయాలపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీతో కూడా సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. తమిళనాడులో కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీవీకే వైపు ఈ వర్గం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే అన్నాడీఎంకే ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండటంతో, నేరుగా కలిసేందుకు విజయ్ వర్గం ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో ముందుగా పార్టీ నుంచి విడిపోయి ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడే ఆలోచనలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రి పదవులు కావాలని ఈ వర్గం కోరినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధించడంతో ఈ తిరుగుబాటు వర్గం ప్రాధాన్యం కొంత తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also ; తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అతిథుల జాబితాలో ప్రముఖులు!
AIADMKడ్యామేజ్ కంట్రోల్ కోసం ఈపీఎస్ రంగంలోకి దిగి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. చెన్నైలోని సీవీ షణ్ముగం నివాసంలో అసమ్మతి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ వర్గంలో మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సి విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్ వంటి కీలక నేతలు కూడా ఉండటం ఈపీఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో తక్షణ నాయకత్వ మార్పు జరగాలని వీరు గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో చెలరేగిన ఈ అంతర్గత కలహాలు పార్టీని చీలిక దిశగా తీసుకెళ్తాయా లేక ఈపీఎస్ రాజీ ఫార్ములాతో పరిస్థితిని చక్కదిద్దగలరా అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

