Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పుల వలయం.. 'కార్మేని సెల్వమ్' మూవీ రివ్యూ!

అప్పుల వలయం.. 'కార్మేని సెల్వమ్' మూవీ రివ్యూ!

వార్త 2 weeks ago

Karmeni Selvam Movie: ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ చిత్రం 'కార్మేని సెల్వమ్'. అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామా మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, జూన్ 3వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

Read also: Peddi movie: కూకట్‌పల్లి అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహానికి ఏకంగా గుడి కట్టేసిన ఫ్యాన్స్

 Karmeni Selvam Movie review

కథ.

చెన్నై సముద్రతీరంలోని ఒక స్లమ్ ఏరియాలో సెల్వమ్ (సముద్రఖని) తన భార్య శాంతి (లక్ష్మీ ప్రియ), ఏడేళ్ల కొడుకు బాలుతో కలిసి నివసిస్తూ ఉంటాడు. శాంతి ఇడ్లీ బండీ నడుపుతూ.. తన భర్త సొంత కారు కొనుక్కుని టాక్సీ నడుపుకోవాలని, అలాగే ఎలాగైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంటుంది. సెల్వమ్ నగరంలోని ఒక సంపన్న వ్యక్తి సంపత్ (గౌతమ్ మీనన్), అతని భార్య దేవి (అభినయ)ల వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు.

సొంత కారు, ఇల్లు కొనాలనే భార్య ముచ్చట తీర్చడం కోసం సెల్వమ్ తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఆ సమయంలో యజమాని సంపత్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడంతో, ఆయన కారును సెల్వమ్ ఎవరికీ తెలియకుండా టాక్సీ సర్వీస్‌లో పెడతాడు. ధనవంతులు కావాలంటే ముందుగా ధనవంతుల్లా బ్రతకడం నేర్చుకోవాలనే భ్రమలో పడిన సెల్వమ్.. విచ్చలవిడిగా అప్పులు చేయడం మొదలుపెడతాడు. స్థలం కొనుగోలు చేయడంతో పాటు, ప్రతి చిన్న అవసరానికి క్రెడిట్ కార్డులను వాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. భార్య ఎంత చెప్తున్నా వినకుండా చేసిన ఈ అప్పుల వల్ల సెల్వమ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఆ అప్పుల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే?

జీవితంలో ఉన్నదానికంటే కాస్త బాగా బ్రతకాలనే ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అందుకోసం అప్పు చేయకూడదనేది భార్య అభిప్రాయం కాగా.. అప్పు చేయకపోతే కొన్ని ఆనందాలను ఎప్పటికీ పొందలేమనేది భర్త ఆలోచన. ఈ ఇద్దరి భిన్నమైన ఆలోచనల చుట్టూనే దర్శకుడు కథను నడిపించారు. “కష్టపడితే వచ్చిన డబ్బును కాదనకు.. కష్టపడకుండా డబ్బు వస్తుందంటే నమ్మకు” అనే ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాను మనం ఫస్టాఫ్, సెకండాఫ్‌గా విడదీసి చూడలేము. మొత్తం ఒక చక్కని ఎమోషన్‌గా సాగుతుంది. నాలుగైదు ప్రధాన పాత్రలతోనే ఒక సింపుల్ లైన్‌ను దర్శకుడు బలంగా ఆవిష్కరించారు. సముద్రఖని, లక్ష్మీ ప్రియల నటనతో పాటు గౌతమ్ మీనన్ – అభినయ ట్రాక్ కూడా మనసులను సున్నితంగా తాకుతుంది. స్మార్ట్‌ఫోన్లు, యాప్‌లు, ఆఫర్ల పేరుతో ఈ రోజుల్లో సామాన్యులు ఎలా క్రెడిట్ కార్డుల వలలో పడి అప్పులపాలు అవుతున్నారో దర్శకుడు చూపించిన తీరు మెప్పిస్తుంది. యువరాజ్ దక్షన్ ఫొటోగ్రఫీ, జగన్ ఎడిటింగ్, నేపథ్య సంగీతం ఈ ఎమోషనల్ కంటెంట్‌ను మరింత బలంగా మార్చాయి.

ముగింపు

ఈ సినిమాలో అనవసరమైన హంగులు, సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూనే, సమాజానికి అవసరమైన ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. “అనవసరమైనవి కొంటూ పోతే, ఒకరోజు అవసరమైనవి కోల్పోతాం” అనే డైలాగ్ ఈ సినిమా అంతరార్థాన్ని తెలియజేస్తుంది. ఆదాయానికి మించి, అవసరాలకు మించి ఖర్చు చేసి ఆశల వెంట పరుగెడితే కుటుంబానికి ఎలా దూరమవుతామో ప్రాక్టికల్‌గా చూపించారు. భార్యాబిడ్డలతో కలిసి సర్దుకుపోవడంలోనే అసలైన ఆనందం ఉందనే సందేశాన్నిచ్చే ఈ సినిమాను ఓటీటీలో కుటుంబంతో కలిసి హ్యాపీగా చూడొచ్చు.

అయ్యప్ప భక్తుడిగా మాస్ మహారాజా.. 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha