Nepal Floods : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు అనేక కుటుంబాల జీవితాలను తీవ్ర విషాదంలోకి నెట్టివేశాయి. త్రిశూలి నది ఉప్పొంగి రావడంతో వచ్చిన వరద ఉధృతికి బేత్రావతి ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు తన జీవితాన్నే కోల్పోయినంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న తన భార్య అత్యవసర వైద్య చికిత్స కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన రూ. 25 లక్షల నగదుతో పాటు ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు, నిత్యావసర వస్తువులన్నీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఉవ్వెత్తున ఎగసిపడిన నీటి ప్రవాహం క్షణాల వ్యవధిలోనే సర్వస్వాన్ని తుడిచిపెట్టేయడంతో తీవ్ర మనోవేదనకు గురవుతూ గుండెలు బాదుకుంటున్నారు.
హిమాలయ పర్వత ప్రాంతంలో ఉద్భవించిన త్రిశూలి నదికి వచ్చిన ఆకస్మిక వరదల (Flash Floods) దాటికి వేలాది ఇళ్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. ఉధృతంగా ప్రవహించిన వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడమే కాకుండా, నది తెచ్చిన మైళ్ల కొద్దీ మట్టి, బురద ఇళ్లలో భారీగా పేరుకుపోయాయి. దీంతో నివాస ప్రాంతాలన్నీ బురదమయంగా మారిపోయి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. సర్వస్వం కోల్పోయి వీధిన పడిన బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, తీవ్ర ప్రతికూల వాతావరణం వల్ల బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

