Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరద విపత్తు నుంచి బయటపడ్డ భారతీయుల కన్నీటి గాథలు

నేపాల్ వరద విపత్తు నుంచి బయటపడ్డ భారతీయుల కన్నీటి గాథలు

వార్త 3 weeks ago

Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదల (Flash Floods) నుంచి ప్రాణాలతో బయటపడి స్వదేశానికి చేరుకున్న భారతీయ పర్యాటకులు, కార్మికులు మరియు యాత్రికులు తమ భయానక అనుభవాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

హిమాలయ దేశంలో చోటుచేసుకున్న ఈ జల ప్రళయం ఎంతటి విధ్వంసం సృష్టించిందో వివరిస్తూ, తాము అదృష్టవశాత్తూ పునర్జన్మ ఎత్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీహార్, తమిళనాడు (చెన్నై), మహారాష్ట్రకు చెందిన పలువురు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకుని అక్కడ గడిపిన నరకప్రాయమైన క్షణాలను వెల్లడించారు.

Read Also : Nepal Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్ లాకర్.. దోచుకున్న 29 మంది అరెస్ట్!

 Heart-wrenching tales of Indians who survived the Nepal flood disaster.

Nepal Flash Floods: 20 అడుగుల ఎత్తున ముంచెత్తిన వరద: బీహార్ కార్మికుల వేదన

బీహార్‌లోని బెట్టియాకు చెందిన వలస కార్మికులు నేపాల్ వరదలను ఒక ఊహకు అందని ప్రళయంగా అభివర్ణించారు.

“మేము ఐదు నుంచి ఏడుగురం ఉన్నాం. మాలో ముగ్గురు వరదలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఉన్నట్టుండి 20 అడుగుల ఎత్తున నీరు ఊరిపైకి ముంచెత్తింది. వెంటనే పిల్లలను తీసుకుని కొండపైకి పరుగులు తీశాం. గంట తర్వాత నీటి ఉద్ధృతి తగ్గడంతో కిందికి వచ్చి వెతికినా, మా వాళ్ల ఆచూకీ లభించలేదు. మళ్లీ ప్రమాదం రావొచ్చని హెచ్చరించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చేశాం” అని ఓ కార్మికుడు రోదించాడు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించిందని, క్షణాల్లో ప్రాంతమంతా ధూళీ ధూసరితంగా మారి నీరు చుట్టుముట్టిందని మరో యువకుడు తెలిపాడు. ఎత్తైన ప్రాంతానికి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నామని, తిరిగి వచ్చి చూసేసరికి ఇళ్లు, మనుషులు ఏవీ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

4 గంటల పాటు చెట్టుపైనే చెన్నై యాత్రికురాలు

కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం వెళ్లిన చెన్నైకి చెందిన ఓ మహిళ ఈ జల ప్రళయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆమె అల్లుడు తెలిపిన వివరాల ప్రకారం. ఆగస్టు 24న ఆమె ఖాట్మండు చేరుకున్నారు. ఆగస్టు 26న చైనా-నేపాల్ సరిహద్దు ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వైపు బస్సులో వెళ్తుండగా ఈ విపత్తు సంభవించింది. నీటి ప్రవాహం, బురదతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో డ్రైవర్ బస్సును వదిలేసి పారిపోయాడు. బస్సులోని 21 మంది ప్రయాణికులు కిందకు దిగి ప్రాణభయంతో పరుగులు తీశారు. అందులో ఉన్న చెన్నై మహిళ సమీపంలోని ఒక చెట్టు ఎక్కి సుమారు 3 నుండి 4 గంటల పాటు అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత నేపాల్ సైనిక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా రక్షించారు.

మహారాష్ట్ర పర్యాటకుల సురక్షిత తిరుగుప్రయాణం

మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. “తిరిగి ప్రాణాలతో స్వదేశం చేరుకుంటామో లేదోనని తీవ్ర ఆందోళన చెందాం. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. మా వద్ద సరైన పత్రాలు లేకపోయినా నేపాల్ అధికారులు, భారత ప్రభుత్వం ఎంతో సహాయం చేశారు” అని నాగ్‌పూర్‌కు చెందిన ఒక మహిళ తెలిపారు.

బాధితులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేసిన భారత, నేపాల్ ప్రభుత్వాలకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నేపాల్ వరదల ప్రవాహంలో కొట్టుకొచ్చి యూపీ నదుల్లో తేలిన 7 మృతదేహాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha