Bombay High Court: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించడం లేదా దానిపై తమ అభిప్రాయాన్ని తెలపడం ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ వ్యతిరేక చర్య కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్య దేశంలో పౌరులందరికీ భిన్నాభిప్రాయాలు కలిగి ఉండే ప్రాథమిక హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)కి చెందిన ఇద్దరు నేతలపై ముంబై పోలీసులు విధించిన నగర బహిష్కరణ (ఎక్సైల్) ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది.
నగర బహిష్కరణ వెనుక అసలు కారణాలు మరియు పోలీసుల చర్య
ఎస్డీపీఐ కార్యకర్తలు ఫిరోజ్ అబ్దుల్ వహాబ్ ఖాన్, మహమ్మద్ రఫిక్ గులాం రసూల్ అన్సారీలను ఏడాది పాటు ముంబై నుంచి బహిష్కరిస్తూ 2025 డిసెంబర్ 3న ముంబై పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు, చెంబూర్-గోవండి ప్రాంతంలో వాయు కాలుష్యంపై ఆందోళనలు, అలాగే బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా చేపట్టిన వివిధ నిరసన కార్యక్రమాల సమయంలో వారిపై 2024, 2025 సంవత్సరాల్లో మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే పోలీసులు వారిపై ఈ కఠిన చర్య తీసుకున్నారు.
Bombay High Court: పోలీసుల తీరును తప్పుబట్టిన జస్టిస్ మాధవ్ జమ్దార్
పోలీసులు జారీ చేసిన బహిష్కరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ మాధవ్ జమ్దార్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించడం వారి వ్యక్తిగత అభిప్రాయమని, దానిని దేశ వ్యతిరేక చర్యగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలు లేదా చారిత్రక ఘటనలపై భిన్నమైన ఆలోచనలు ఉండే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
పక్షపాత ధోరణిని ఎత్తిచూపిన న్యాయస్థానం
పిటిషనర్లపై నమోదైన ఎఫ్ఐఆర్‌లలో ఒక నిరసన కార్యక్రమం ప్రతిపక్షాలు చేపట్టిందని, అందులో కాంగ్రెస్ అలాగే శివసేన (యూబీటీ) కార్యకర్తలు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారని కోర్టు గుర్తించింది. అయితే, కేవలం ఎస్డీపీఐ కార్యకర్తలపై మాత్రమే ఈ తీవ్ర చర్య తీసుకోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. మిగతా పార్టీల కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఇది ఏకపక్ష చర్యగా స్పష్టమవుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఊహాజనిత భయాలతో ప్రాథమిక హక్కులను హరించలేం
నిందితులు చేసిన నినాదాలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయన్న ప్రభుత్వ వాదనలకు సరైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది. కేవలం ఊహాజనిత భయాల ఆధారంగా పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడానికి వీలేదని స్పష్టం చేసింది. నగర బహిష్కరణ అనేది అత్యంత అసాధారణమైన చట్టపరమైన చర్య అని, ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ముంబై పోలీసులకు హైకోర్టు తేల్చిచెప్పింది.
శ్రావణ మాసం వేళ నాగర్‌సోల్ ప్రత్యేక రైళ్లు.. రూట్ వివరాలు ఇవే!

