Sheikh Hasina : తాను ఈ ఏడాది ఖచ్చితంగా స్వదేశమైన బంగ్లాదేశ్‌లో అడుగుపెడతానని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పష్టం చేశారు. 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమం కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ప్రాణాలు రక్షించుకోవడానికి ఆమె భారతదేశంలో శరణు పొందిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ విరామం తర్వాత ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. మైనార్టీలపై జరిగే ప్రతి దాడిని, ఆ దేశ స్వాతంత్ర్యం మరియు సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అవామీ లీగ్ ఒక 'శక్తి'
తమ రాజకీయ పక్షమైన అవామీ లీగ్ పార్టీ కేవలం ఒక సాధారణ రాజకీయ సంస్థ మాత్రమే కాదని, అది బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఒక విచ్ఛిన్నం కాని 'శక్తి' అని షేక్ హసీనా అభివర్ణించారు. గతంలో తనను రాజకీయంగా అంతమొందించడానికి ప్రత్యర్థులు గ్రెనేడ్లతో దాడులు చేసి చంపడానికి ప్రయత్నించారని ఆమె గుర్తుచేశారు. అల్లా దయ వల్ల తాను ఆ ప్రమాదాల నుండి తృటిలో తప్పించుకున్నానని, అందువల్ల తనకు మరణం అన్నా, రాజకీయ బెదిరింపులన్నా ఎలాంటి భయం లేదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ క్రమంలోనే త్వరలోనే స్వదేశానికి తిరుగుపయనం కానున్నట్లు హసీనా ప్రకటించారు.

