Bethlehem Kudumba Unit Movie: నివిన్ పోలీ, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ రొమాంటిక్ కామిడీ చిత్రం 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్' థియేటర్లలోనే కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్లోనూ భారీ రికార్డులను సృష్టిస్తోంది.
ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఓర్‌మ్యాక్స్ స్ట్రీమ్‌వ్యూ’ అందించిన నివేదిక ప్రకారం, 2026లో భారత్‌లో ఓటీటీ ఆరంభ వారంలో (ఓపెనింగ్ వీకెండ్) అత్యధిక వ్యూస్ సాధించిన నాన్-హిందీ చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది.
ఓటీటీలో వ్యూస్ సునామీ
‘జియోహాట్‌స్టార్’ వేదికగా అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 4 వరకు ఉన్న కాలంలో ఈ చిత్రం ఏకంగా 5.4 మిలియన్ల (54 లక్షలు) వ్యూస్‌ను నమోదు చేసింది. భారతదేశంలో ఏ భాషలోనైనా ఈ సినిమాను 30 నిమిషాలకు పైగా తిలకించిన యూనిక్ ప్రేక్షకులను ప్రామాణికంగా తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన అనంతరం ఓటీటీలోనూ ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషం.

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. అత్యధిక రేటింగ్స్
స్ట్రీమింగ్ వ్యూస్లోనే కాకుండా ఆడియన్స్ రేటింగ్స్‌లోనూ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2026లో భారతదేశంలో విడుదలైన అన్ని భాషల థియేట్రికల్ సినిమాల్లో కెల్లా అత్యధికంగా ‘ఓర్‌మ్యాక్స్ పవర్ రేటింగ్’ (OPR) 92 సాధించి “మోస్ట్ లైక్డ్ మూవీ”గా నిలిచింది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఆకట్టుకున్న ఫ్యామిలీ, లవ్ డ్రామా
‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివిన్ పోలీ ‘జస్టిన్’గా, మమితా బైజూ ‘యాష్లే’గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కొత్త కాలనీకి మారిన యాష్లే కుటుంబం, అక్కడే నివసించే జస్టిన్ అనే పక్కింటి యువకుడి మధ్య చిగురించిన పరిచయం, ప్రేమ, కుటుంబ సమీకరణాలు, సరదా సన్నివేశాలు మరియు భావోద్వేగాలతో ఈ కథ సాగుతుంది. సింపుల్ స్టోరీలైన్, ఆకట్టుకునే కామెడీ మరియు యూత్‌ఫుల్ లవ్ ట్రాక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Read Also Epaper : epaper.vaartha.com

