Donald Trump : ఇరాన్‌తో చమురు మరియు పెట్రోకెమికల్ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయనే ఆరోపణలతో డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం 4 భారతీయ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధించింది.
సదరు భారతీయ సంస్థలు ఇరాన్ ఇంధన రంగానికి మద్దతుగా దాదాపు $119 మిలియన్ల (రూ. 1,000 కోట్లకు పైగా) విలువైన ఆయిల్ మరియు పెట్రో కెమికల్ ఉత్పత్తుల ట్రేడింగ్‌లో భాగస్వామ్యమయ్యాయని యుఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఈ ఆంక్షల జాబితాలో ‘సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్’, ‘PP సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘ప్రకృతీస్ ఇన్ఫ్రా ఇంపాెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’, మరియు ‘పోర్ట్జ్ పార్ట్‌నర్స్ LLP’ అనే నాలుగు సంస్థలు ఉన్నాయి. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాషింగ్టన్ ప్రకటించింది.

ముగ్గురు భారతీయులపైనా వేటు: అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం
ఈ నాలుగు కంపెనీల ఆర్థిక లావాదేవీల నిర్వహణతో నేరుగా సంబంధం ఉన్న ముగ్గురు భారతీయ పౌరులపై కూడా అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. అమెరికా విధించిన ఈ నిషేధం వల్ల సదరు కంపెనీలు మరియు వ్యక్తుల యొక్క యుఎస్ పరిధిలోని ఆస్తులు స్తంభించిపోవడమే కాకుండా, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం అత్యంత క్లిష్టంగా మారనుంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక చర్యలు అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసాయి. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే ఇతర దేశాల సంస్థలకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

