Ellampally Project : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి (Ellampally Project) ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దాదాపు 60 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా :
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 10 టీఎంసీలను దాటింది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు నిర్వహణ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

ఇక రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ వద్ద కీలక చర్యలు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన మూడు భారీ బాహుబలి మోటార్లను ప్రారంభించి, సుమారు 3 వేల క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరు ప్రాజెక్టు వైపు తరలిస్తున్నారు. ఈ చర్యలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గడంతో పాటు దిగువ ప్రాంతాల సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడనుంది.
మరోవైపు, ధర్మపురి వద్ద గోదావరి నది నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు నది ఒడ్డుకు వెళ్లకుండా, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాలు వ్యవసాయానికి ఊరటనిస్తుండగా, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరగడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది.
తిరువీర్, ఆషికా రంగనాథ్‌తో SKN కొత్త సినిమా 'అది నా పిల్లరా'!

