Chicken, Egg Price: హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో లైవ్ కోడి ధర రూ.
160 దాటగా, విత్ స్కిన్ చికెన్ ధర రూ. 280 నుంచి రూ. 300 వరకు ఉంది. ఇక వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే స్కిన్‌లెస్ చికెన్ ధర రిటైల్ మార్కెట్‌లో ఏకంగా రూ. 340 నుండి రూ. 350 కి చేరింది. గతంలో ఐదు నుంచి ఆరు రూపాయల లోపు లభించిన ఒక్కో కోడిగుడ్డు ధర ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో రూ. 8 నుంచి రూ. 8.50 కి చేరింది. దీనివల్ల మార్కెట్‌లో డజన్ గుడ్ల ధర రూ. 100 మార్కును తాకింది. హోల్‌సేల్ వ్యాపారులే ఒక్కో గుడ్డును రూ. 7.50 వరకు విక్రయిస్తుండటంతో, రిటైల్ దుకాణాలు, కిరాణా షాపుల్లో ధరలు మరింత ప్రియమయ్యాయి. ఈ ప్రభావంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడుల్స్ మరియు ఆమ్లెట్ ధరలను కూడా రూ. 10 నుండి రూ. 20 వరకు పెంచేశారు.
Read Also: Telangana weather: వాన జాడే లేదు.. ఆందోళనలో అన్నదాతలు!
Chicken, Egg Price
Chicken, Egg Price: ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలు
చికెన్, గుడ్ల ధరలు అమాంతం పెరగడానికి పౌల్ట్రీ రంగా నిపుణులు కొన్ని ముఖ్యమైన కారణాలను వివరిస్తున్నారు:
- ఉత్పత్తి తగ్గడం: ఇటీవలి తీవ్రమైన ఎండల కారణంగా పౌల్ట్రీ ఫారాలలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఉష్ణోగ్రతల ప్రభావంతో కోళ్ల ఎదుగుదల తగ్గి, ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
- పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల: కోళ్లకు పెట్టే మేత (సోయాబీన్, జొన్నలు, మొక్కజొన్న) ధరలు భారీగా పెరగడంతో కోళ్ల పెంపకం వ్యయం (Production Cost) పెరిగింది.
- డిమాండ్ పెరగడం: ప్రస్తుతం వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో మార్కెట్‌లో చికెన్, గుడ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు కొండెక్కాయి. ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి కుటుంబాలు తమ బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నాయి. వారానికి ఒకటి రెండు సార్లు చికెన్ తినే వారు, ఇప్పుడు నెలకు ఒకట్రెండు సార్లకు పరిమితం అవుతున్నారు. కిలో కొనేవారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. అటు చికెన్ సెంటర్ల వ్యాపారులు కూడా వ్యాపారం సాగక, అమ్మకాలు తగ్గిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సరఫరా మెరుగయ్యే వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Epaper: epaper.vaartha.com

