UP : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటనా ఒకటి వెలుగు చూసింది. కుటుంబంలో ఉత్పన్నమైన ఊహించని పరిస్థితుల నేపథ్యంలో, ఓ భర్తే స్వయంగా చొరవ తీసుకుని తన భార్యను ఆమె ప్రేమించిన ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.
వివరాల్లోకి వెళ్తే, సదరు దంపతులకు 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వీరికి ఐదుగురు సంతానం కూడా ఉన్నారు. అయితే, కొన్ని నెలల క్రితం ఆ మహిళ తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన గ్రామానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడి, రెండు నెలల క్రితం అతనితో వెళ్లిపోయింది. ఇటీవల ఆ మహిళ తిరిగి గ్రామానికి రావడంతో కుటుంబంలో తీవ్ర వివాదం చెలరేగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ముదరడంతో, పంచాయితీ సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి.

కుటుంబాల సమక్షంలో పరిష్కారం: సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలు వైరల్
చివరికి ముగ్గురి కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో సదరు భర్త ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య మనసును మార్చలేనని గ్రహించిన అతడు, వివాదాన్ని శాంతియుతంగా ముగించేందుకు ఆమెకు ప్రియుడితోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. గ్రామస్థుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వారిద్దరికీ వివాహం జరిపించి, శుభాకాంక్షలు తెలుపుతూ సాగనంపాడు. ఈ విచిత్ర పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. భార్య కోరికను గౌరవిస్తూ, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గొడవలు లేకుండా భర్త వ్యవహరించిన తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

