Bhogapuram Airport : విజియానగరం జిల్లా భోగాపురంలో జిఎమ్‌ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ (AERA) ప్రయాణికుల వినియోగ రుసుములను ఖరారు చేసింది.
ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దేశీయ (డొమెస్టిక్) ప్రయాణికులపై రూ.835, అంతర్జాతీయ ప్రయాణికులపై రూ. 1,255 చొప్పున యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (UDF) విధించనున్నారు. ఇక విదేశాలు లేదా ఇతర ప్రాంతాల నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే డొమెస్టిక్ ప్రయాణికులు రూ.355, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రూ.545 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములను విమానాశ్రయ నిర్వహణ, మౌలిక సదుపాయాల వ్యయం కోసమని నేరుగా విమాన టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు.
Bhogapuram International Airportఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సేవలు బంద్!
రూ. 4,700 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని రాబోయే ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో, ప్రస్తుతం విశాఖపట్నంలోని నావికాదళం పరిధిలో కొనసాగుతున్న పౌర విమానయాన సేవలను పూర్తిగా నిలిపివేసి, వాణిజ్య కార్యకలాపాలన్నింటినీ భోగాపురానికే తరలించనున్నారు. ఉత్తరాంధ్ర వాసులకు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభవం లభించనున్నప్పటికీ, మిగతా విమానాశ్రయాలతో పోలిస్తే ఇక్కడ యూజర్ ఛార్జీలు ఎక్కువగా ఉండటం పట్ల ప్రయాణికుల నుంచి కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.

