CM Chandrababu met PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రధానమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు.
దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలు మరియు తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. విజయనగరం జిల్లాలో నూతనంగా నిర్మితమైన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ (భోగాపురం ఎయిర్‌పోర్ట్) ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానపత్రం అందించారు.
Read Also: Tammineni Sitaram: తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో దక్కని ఊరట
CM Chandrababu met PM Modi
CM Chandrababu met PM Modi : ఆగస్టు 1న ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని ప్రధానికి పరిచయం చేయగా, “అప్పలనాయుడు నాకు బాగా తెలుసు, ఆయన రోజూ సైకిల్‌పై పార్లమెంటుకు వస్తుంటారు” అని ప్రధాని చిరునవ్వుతో వ్యాఖ్యానించడం విశేషం. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ మరియు ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన సీఎం, పోలవరం ప్రాజెక్టు మరియు ‘జల్ జీవన్ మిషన్’ పురోగతిపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న వర్క్ స్టాప్ ఆర్డర్‌ను పూర్తిగా ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో పోలవరం ముంపు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించడమే కాకుండా, పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని పాటిల్‌ను ఆహ్వానించారు. కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్‌లతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు మరియు ఇతర ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తవుదలపై సమాలోచనలు జరిపారు.

