Bhubharati server issues: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి పోర్టల్లో కొనసాగుతున్న సాంకేతిక సమస్యలు రంగారెడ్డి జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
ముఖ్యంగా జిల్లాలో అత్యధికంగా వ్యవసాయ భూముల కొనుగోలు, విక్రయాలు జరిగే చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాద్‌నగర్, కందుకూరు, ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, కొత్తూరు, మాడ్గుల, నందిగామ తదితర రూరల్ మండలాల్లో రిజిస్ట్రేషన్లు దాదాపు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు, భూ యజమానులు, కొనుగోలుదారులు రోజూ తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Bhu-Bharathi server malfunction… Farmers face long waits for registrations.
Bhubharati server issues: స్తంభించిన దస్త్రాల పరిశీలన.. రాత్రి వేళల్లోనే స్లాట్ల బుకింగ్
కార్యాలయ సమయాల్లో భూభారతి సర్వర్ స్పందించకపోవడంతో దస్త్రాల పరిశీలన, వివరాల అప్లోడ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మాత్రమే సర్వర్ కొంత మేర పనిచేస్తుండటంతో అప్పుడే రిజిస్ట్రేషన్ స్లాట్లను బుక్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ మరుసటి రోజు కార్యాలయానికి వచ్చిన రైతులు, కొనుగోలుదారులు గంటల తరబడి వేచి చూసినా సర్వర్ పనిచేయకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఇటీవల ప్రభుత్వం పెంచిన మార్కెట్ విలువల ప్రకారం లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించిన తర్వాత కూడా పని పూర్తికాకపోవడంపై దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించినా రిజిస్ట్రేషన్ జరగకపోవడం వల్ల ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ శివార్లలో వేగంగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాద్‌నగర్, కందుకూరు ప్రాంతాల్లో భూముల లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫార్మ్‌ల్యాండ్లు, వెంచర్లు, పరిశ్రమల విస్తరణతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో సర్వర్ సమస్యల కారణంగా మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తమైంది.
వేల సంఖ్యలో పెండింగ్ దస్త్రాలు.. పెరిగిన పని ఒత్తిడి
జిల్లాలోని వివిధ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం 200కు పైగా రిజిస్ట్రేషన్ దస్త్రాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రతిరోజూ కొత్త దరఖాస్తులు చేరుతుండటంతో పెండింగ్ మరింత పెరుగుతోంది. భూముల కొనుగోలు, విక్రయాలతో పాటు వారసత్వ మార్పులు, కుటుంబ విభజనలు, వ్యవసాయ భూముల బదిలీలు కూడా ఆలస్యమవుతున్నాయి.రిజిస్ట్రేషన్లు పూర్తికాకపోవడంతో బ్యాంకు రుణాల మంజూరు, వ్యవసాయ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా ప్రభావితమవుతున్నాయి. పలువురు రైతులు వ్యవసాయ పనులను వదిలి వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ ఖర్చులు, సమయం వృథా కావడంతో పాటు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.మరోవైపు సర్వర్ సమస్యలతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కార్యాలయ వేళల్లో పని జరగకపోవడంతో రాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాల్సి వస్తోందని, అయినప్పటికీ పెండింగ్ దరఖాస్తులు తగ్గడం లేదని తెలుస్తోంది.
సాంకేతిక లోపాలు పరిష్కరించాలని రైతుల విజ్ఞప్తి
ఖరీఫ్ సాగు సీజన్ కొనసాగుతున్న వేళ భూముల రిజిస్ట్రేషన్లు ఆలస్యం కావడం రైతులకు అదనపు భారంగా మారింది. భూభారతి పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించి, కార్యాలయ సమయాల్లో సర్వర్ నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు, భూ యజమానులు, రిజిస్ట్రేషన్ దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ దస్త్రాలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

