Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష!

భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష!

వార్త 1 week ago

Vizianagaram Land Acquisition: విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబంధించిన భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.

రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో కలిసి ఆయన ఆర్డీవోలు, తాసిల్దార్లతో విస్తృతంగా చర్చించారు.

నిర్దేశిత గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు భూములను అప్పగించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ మరియు పారిశ్రామిక అవసరాల కోసం జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం 100 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ లేదా అసైన్డ్ భూములను ముందస్తుగా గుర్తించి ‘ల్యాండ్ బ్యాంక్’ సిద్ధంగా ఉంచాలని తాసిల్దార్లకు సూచించారు. పరిశ్రమల స్థాపన కోసం భూములు కోల్పోతున్న స్థానిక రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని, ఆయా పరిశ్రమల్లోనే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి !

రూ. 1,440 కోట్ల పెట్టుబడితో ఉమెనోవా ఆగ్రో ఫుడ్ పార్క్..

జిల్లాలో ప్రతిపాదిత మరియు ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు కీలక ప్రాజెక్టుల భూ అవసరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు:

  • ఉమెనోవా ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్: బయో-న్యూట్రిషన్ ఫుడ్స్ మరియు ప్రిసిషన్ ఫెర్మెంటేషన్ రంగంలో రూ. 1,440 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రానుంది. దీని ద్వారా దాదాపు 2,500 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు 160 ఎకరాల భూమి అవసరం కాగా, సంస్థ ప్రతినిధులు ఇప్పటికే కొండకిండాం ప్రాంతాన్ని సందర్శించారు. అయితే, ప్రాజెక్టు స్థాపనకు పక్క గ్రామంలో అదనపు భూమి కావాలని వారు కోరడంతో, ఆ మేరకు భూసేకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
  • సన్‌రైజ్ నేచర్ ఫుడ్స్: మామిడి, పనస పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 50 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ముందుకు వచ్చింది. దీని ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, 50 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. భోగాపురం మండలం కొంగవానిపాలెం గ్రామంలోని 20 ఎకరాల అసైన్డ్ భూములను ఈ ప్రాజెక్టుకు కేటాయించాలని నిర్వాహకులు కోరగా, సదరు భూముల కేటాయింపుపై తక్షణమే సాధ్యాసాధ్యాల నివేదిక సమర్పించాలని భోగాపురం తాసిల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.
  • ఇండియన్ ప్రైమ్ కాఫీ: రూ. 150 కోట్ల అంచనా వ్యయం, 250 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 25-30 ఎకరాల భూమిని ఈ సంస్థ కోరింది. ప్రతినిధులు బొండపల్లి మండలం కొండకిండాం సైట్‌ను సందర్శించినప్పటికీ, అక్కడ ప్రాజెక్టు స్థాపనకు వారు సుముఖత వ్యక్తం చేయలేదని అధికారులు తెలపడంతో.. ప్రత్యామ్నాయ భూములను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.

 Vizianagaram Land Acquisition

ఏపీఐఐసీ (APIIC) భూముల పురోగతిపై సమీక్ష

జిల్లాలో ఏపీఐఐసీకి అప్పగించిన, ప్రతిపాదించిన ఇతర భూముల పురోగతిని కూడా ఈ సమావేశంలో కలెక్టర్‌ సమీక్షించారు:

  • కొండకిండాం సైట్: విజయనగరం మండలంలోని కొండకిండాంలో ఏపీఐఐసీకి కేటాయించిన 12 ఎకరాల భూమిని ఇప్పటికే అప్పగించారు. ఇది జాతీయ రహదారి-16 (NH-16) కి సుమారు 16 కిలోమీటర్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • రాజాం నియోజకవర్గం: రేగిడి ఆమదాలవలస మండలం గుల్లపాడులో ఎంఎస్ఎంఈ (MSME) పార్కు కోసం 20 ఎకరాల భూమిని గుర్తించగా, ఈ ప్రాంతంలోనే మరో 300 ఎకరాల భూమిని అదనంగా సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. రాజాం మండలం గారచీపురుపల్లిలో 31.68 ఎకరాల భూమిని గుర్తించి, ఏపీఐఐసీ నుండి భూసేకరణ అభ్యర్థనను స్వీకరించారు.
  • చీపురుపల్లి నియోజకవర్గం: గరివిడి మండలం కాపుసంభం, బి.జి.పాలెం గ్రామాల పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం ప్రతిపాదించిన 26.71 ఎకరాల భూమిని వారం రోజుల్లోగా సేకరించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
  • ఇతర మెగా ప్రాజెక్టులు: బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం ఆకులకట్ట వద్ద 210 ఎకరాల్లో మెగా ఫుడ్ ప్రాజెక్ట్‌, కొత్తవలసలో పతంజలి ఇండస్ట్రియల్ పార్క్, జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్, కొత్తవలస ఇన్‌ఫ్రావెంచర్, అలాగే భోగాపురం మండలం పోలిపల్లి వద్ద డేటా సెంటర్ భూసేకరణపైనా ఉన్నతాధికారులతో కలెక్టర్ చర్చించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మాట్లాడుతూ.. భూసేకరణలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా పారదర్శకంగా, వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. సమీక్షలో ఆర్డీవోలు సుధాసాగర్, మోహనరావు, ఎస్‌డీసీ అరుణకుమారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వి.కృష్ణప్రసాద్, సంబంధిత మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha