Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్

బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్

వార్త 5 days ago

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈ చర్చ కోసం అవసరమైతే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడానికి కూడా తమ ప్రభుత్వం వెనకాడదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ఈ సవాల్ విసిరారు.

పదేళ్ల బీఆర్ఎస్, 12 ఏళ్ల బీజేపీ పాలనతో పోల్చుకుందాం!

కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్లన్నర పాలనను, గత బీఆర్ఎస్ పదేళ్ల అధికార కాలంతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పరిపాలనతో పోల్చి చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేవలం ప్రభుత్వాల పాలనే కాకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన పార్టీల మేనిఫెస్టోల అమలుపై కూడా చర్చకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ చర్చకు ప్రతిపక్షాలు నిజంగా సిద్ధమైతే.. వెంటనే అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్‌లకు అధికారికంగా లేఖలు ఇవ్వాలని ఆయన సూచించారు.

Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం

ఈ వేదికగా బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి కనీస అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ గృహవసతి కల్పిస్తోందని, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీని విజయవంతంగా చేపడుతోందని వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రతిష్టాత్మక ‘మూసీ నది ప్రక్షాళన’ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని, దానిని పూర్తి చేసి తీరుతామని సీఎం పునరుద్ఘాటించారు.

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

'ఇడుపు కాయితం' అంటే ఏంటో పవన్ కళ్యాణ్‌ను అడగండి: కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha