Dailyhunt
బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయిన మమతా బెనర్జీ

బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయిన మమతా బెనర్జీ

వార్త 4 days ago

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (మే 2026) కనీవినీ ఎరుగని రాజకీయ సంచలనం నమోదైంది. గత పదిహేనేళ్లుగా బెంగాల్‌ను ఏలుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత గడ్డ, కంచుకోటగా భావించే భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆమెపై సుమారు 15,105 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో మొదట మమత ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరి రౌండ్లలో సువేందు అనూహ్యంగా పుంజుకుని విజయాన్ని కైవసం చేసుకున్నారు. దీదీ కోటగా పేరుగాంచిన భవానీపూర్‌లో కమలం వికసించడంతో టీఎంసీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

Read Also : తండ్రి ఓడినా.. కొడుకు గెలిచాడు: ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం!

 Modi vs Mamatha

రిపీట్ అయిన ‘నందిగ్రామ్’ సీన్ – సువేందు అధికారి ‘జయం’ట్ కిల్లర్

గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సువేందు అధికారి, మరోసారి తన సత్తా చాటారు. నాడు నందిగ్రామ్‌లో ఓడినా భవానీపూర్ ఉపఎన్నికలో గెలిచి మమత తన సీఎం పదవిని కాపాడుకున్నారు. కానీ ఈసారి సాధారణ ఎన్నికల్లోనే ఆమెను తన సొంత నియోజకవర్గంలో ఓడించడం ద్వారా సువేందు బెంగాల్ రాజకీయాల్లో ‘జయంట్ కిల్లర్’గా నిలిచారు. ఈ ఓటమి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత భారీ ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

బెంగాల్‌లో మారుతున్న మ్యాప్ – బీజేపీ చారిత్రాత్మక మెజారిటీ

మమతా బెనర్జీ ఓటమితో పాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తాజా ఫలితాల ప్రకారం, 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (148) దాటి 170కి పైగా స్థానాల్లో విజయం సాధించే దిశగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ తన పట్టు కోల్పోవడంతో, బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. “బెంగాల్ ప్రజలు భయం నుండి విముక్తి పొందారు” అని ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయంపై స్పందిస్తూ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లోనే సరికొత్త సమీకరణాలకు దారితీయనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్యం గెలిచింది: ఎంపీ నవనీత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha