Breakfast Movie: రానవ్ - రోస్మిన్ ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ సినిమానే 'బ్రేక్ ఫాస్ట్'. గిరిజా వరదరాజ్ నిర్మించిన ఈ సినిమాకి, గాంధీకృష్ణ దర్శకత్వం వహించాడు.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. సంపత్ రాజ్ - అర్చన కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also: Nani The Paradise Movie: నాని 'ద ప్యారడైజ్' మూవీ మరోసారి వాయిదా?
breakfast movie review
Breakfast Movie: కథ
రిషభ్, లక్ష్మీ అనే కొత్తగా పెళ్లైన దంపతులు కేవలం మూడు నెలలకే విడిపోవాలని నిర్ణయించుకుంటారు. కౌన్సిలింగ్ కోసం వారు సైకియాట్రిస్ట్ గంగాదేవి (కస్తూరి)ని కలుస్తారు. వారి మధ్య ఉన్న గొడవలను చూసిన గంగాదేవి, వారికి గతంలో జరిగిన శంతను, జాన్వీల ప్రేమకథను చెప్పడం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి అసలు కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. శంతను (రానవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి, మలేసియాలో జాబ్ చేసి కొన్ని కారణాల వల్ల తిరిగి వచ్చేస్తాడు. కానీ తాను ఇంకా మలేసియాలోనే ఉన్నట్లు నమ్మిస్తూ, తండ్రి వైద్యానికి డబ్బులు పంపుతుంటాడు. సర్టిఫికెట్స్ సీజ్ అవ్వడంతో దొరికిన పనులు చేసుకునే శంతను, ఒకరోజు కోటీశ్వరుడైన రాజారామ్ (సంపత్ రాజ్) కూతురు జాన్వీ (రోస్మిన్) కంటపడతాడు. శంతను వ్యక్తిత్వం నచ్చి జాన్వీ తన బిస్కట్ కంపెనీలో ఉద్యోగం ఇస్తుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, తండ్రిని ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు.
ఫస్టాఫ్‌లో శ్రీమంతురాలైన జాన్వీ, పేదింటి శంతనును ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తన సంస్థ బాధ్యతలను అతనికి అప్పగించడం వరకు కథ చకచకా సాగిపోతుంది. అయితే సెకండాఫ్‌లో శంతను పల్లెటూరి తల్లిదండ్రులు వీరి ఇంటికి రావడంతో అసలు సమస్య మొదలవుతుంది. వారి అలవాట్లు, అమాయకత్వం నచ్చని జాన్వీ వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తుంది. దీనితో భార్యాభర్తల మధ్య అహం (ఈగో)లు తలెత్తి కథ ప్రీ-క్లైమాక్స్ దిశగా వేడెక్కుతుంది. సాధారణంగా ఇలాంటి కథల్లో ధనవంతుడైన తండ్రి విలన్‌గా మారి ఇబ్బంది పెడతాడు. కానీ ఇక్కడ తండ్రి పాత్ర పక్కకు వెళ్లిపోయి, భార్యాభర్తలే ఒకరితో ఒకరు తలపడటం కొత్తగా అనిపిస్తుంది. ముగింపులో వచ్చే ఒక అంచనాలకు అందని ట్విస్ట్ అప్పటివరకు చూసిన కథ బరువును పెంచి, సినిమాను యావరేజ్ ప్లేస్‌లో నిలబెడుతుంది.
నటీనటుల ప్రతిభ
రోస్మిన్ & రానవ్ కథ మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. డబ్బు, అహంభావం ఉన్న పాత్రలో రోస్మిన్ నటన ఆకట్టుకోగా, తల్లిదండ్రుల పట్ల బాధ్యత గల యువకుడిగా రానవ్ మంచి మార్కులు కొట్టేసాడు. ఇతర నటీనటులు, సంపత్ రాజ్, అర్చన, కస్తూరి తమ పరిధి మేరకు బాగానే చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, పన్నీర్ సెల్వమ్ ఫొటోగ్రఫీ ఫరవాలేదనిపిస్తాయి. భాస్కర్ ఎడిటింగ్ ఓకే.
ముగింపు
తల్లిదండ్రులను ప్రేమించలేనివారు మరెవరినీ ప్రేమించలేరు. ఈగోల కోసం వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకోకుండా, సర్దుకుపోవడంలోనే సంతోషం ఉంటుంది" అనే మంచి సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. ఒక ఓ మోస్తరు (యావరేజ్) ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకునే వారు అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
Epaper: epaper.vaartha.com

