Chennai: సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫైనాన్స్ మరియు పెట్టుబడులపై అవగాహన కల్పిస్తూ ఎంతో పేరు సంపాదించుకున్న యువ ఇన్‌ఫ్లుయెన్సర్ వి.హరీశ్ (27) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు.
చెన్నై శివారులోని ముట్టుకాడు ప్రాంతంలో ఆయన అద్దెకు ఉంటున్న విల్లాలో మంగళవారం విగతజీవిగా పడిఉన్నారు. ‘ఫైనాన్స్ విత్ హరీశ్’ పేరిట ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా గత ఐదేళ్లుగా ఫైనాన్షియల్ కంటెంట్ అందిస్తున్న ఆయనకు దాదాపు 13 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

సైబర్ వేధింపులు, రూ.3 కోట్ల డిమాండ్: తండ్రి సంచలన ఆరోపణలు
తన కుమారుడి అకాల మృతికి తీవ్రమైన సైబర్ వేధింపులే కారణమని హరీశ్ తండ్రి జె.వినాయగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘జెమురియా ఇంక్’ వెంచర్ స్టూడియో సీఈఓ జేసన్ శామ్యూల్ తమ కుమారుడిని లక్ష్యంగా చేసుకుని పరువు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 18న హరీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ శామ్యూల్ వీడియోలు విడుదల చేశారని తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయిస్తానని బెదిరించి రూ.3 కోట్లు డిమాండ్ చేశారని, ఈ క్రమంలో కొందరి రాజకీయ ప్రముఖుల పేర్లను కూడా ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Chennai: చనిపోయే ముందు హరీశ్ రికార్డ్ చేసిన చివరి వీడియో
ఈ వివాదం తన ఐదేళ్ల కష్టాన్ని, పరువును పూర్తిగా దెబ్బతీసిందని మరణానికి ముందు హరీశ్ ఒక వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తనపై మానసిక వేధింపులకు పాల్పడ్డారని, ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారని ఆ వీడియోలో వివరించారు. ఈ వీడియోను తప్పకుండా బయటపెట్టాలని ఆయన కోరారు. మరోవైపు, శామ్యూల్ ఆరోపణల నేపథ్యంలో మెటా సంస్థ హరీశ్ అధికారిక ఖాతాలను డిజేబుల్ చేయగా, ఆయన కొత్తగా ప్రారంభించిన ఖాతాను కూడా తొలగించింది.
ఆరోపణలను ఖండించిన జేసన్ శామ్యూల్
హరీశ్ మృతిపై జేసన్ శామ్యూల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తనపై వస్తున్న సైబర్ వేధింపుల ఆరోపణలను పూర్తిగా ఖండించారు. హరీశ్ మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే, సెబీ (SEBI) రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లైసెన్స్ లేకుండా, ఏఎంఎఫ్ఐ (AMFI) రిజిస్ట్రేషన్‌ను తప్పుగా చూపుతూ హరీశ్ ఫైనాన్స్ సలహాలు ఇస్తున్నారనే విషయాన్ని మాత్రమే తాను ప్రశ్నించానని తెలిపారు. సరైన నిబంధనలతో పనిచేయాలని సూచించానే తప్ప, ఈ స్థాయి పరిణామం జరుగుతుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై కానత్తూరు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. హరీశ్ చివరి వీడియో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఆన్‌లైన్ క్రియేటర్ల అర్హతలు, సోషల్ మీడియా వేదికల బాధ్యతలు మరియు ఆన్‌లైన్ వేధింపుల తీవ్రతపై పెద్ద చర్చకు దారితీసింది.
Epaper: epaper.vaartha.com

