Moinabad Farmhouse Snake Bite: ఫాంహౌస్‌లో స్నేహితులతో కలిసి వీకెండ్ సరదాగా గడుపుదామని వెళ్లిన ఒక యువ వ్యాపారవేత్త జీవితం, చిన్న పాముతో చేసిన సాహసం వల్ల విషాదాంతమైంది.
పామును చేతితో పట్టుకొని రీల్స్ లేదా స్నేహితులను భయపెట్టే ప్రయత్నంలో అది కాటు వేయడం, సమయానికి చికిత్స తీసుకోకపోవడంతో 30 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘోర సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
Read Also :Vizag techie Radha Gayatri death: వైజాగ్ టెకీ గాయత్రి మృతిపై కన్నవారి సంచలన అనుమానాలు!
అర్ధరాత్రి ఫాంహౌస్‌లో సాహసం - ప్రాణం తీసిన కట్లపాము
Moinabad Farmhouse Snake Bite Incident
మొయినాబాద్ పోలీసులు మరియు స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ హుస్సైనీ (30) ఒక వ్యాపారవేత్త. మొహిద్దీన్‌కు మొయినాబాద్ పరిధిలో ఒక సొంత ఫాంహౌస్ ఉంది. జూన్ 17న రాత్రి ఆయన తన స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడపడానికి అక్కడికి వెళ్లారు. జూన్ 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫాంహౌస్‌లోకి ఒక చిన్న ‘కట్లపాము’ (Krait) వచ్చింది. దాన్ని చూసి భయపడకుండా, మొహిద్దీన్ సరదాగా చేతితో పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ పామును చూపిస్తూ పక్కనున్న స్నేహితులను భయపెట్టడం ప్రారంభించారు.
Moinabad Farmhouse Snake Bite:”నాకేం కాదు” అన్నాడు.. గంటలోనే విషం పాకింది
ఆటలాడిస్తున్న క్రమంలో కట్లపాము మొహిద్దీన్ కుడిచేతి బొటనవేలును గట్టిగా పట్టుకొని కాటేసింది. పాము కరుస్తున్నా మొహిద్దీన్ దాన్ని విదిల్చి అవతలకు విసిరేశారు. పక్కనున్న స్నేహితులు భయపడి వెంటనే ఆసుపత్రికి వెళ్దామని బతిమిలాడినా.. “నాకేం కాదు, చిన్న పామే కదా, దానికి అంత విషం ఉండదు” అంటూ మొహిద్దీన్ నిర్లక్ష్యం వహించారు. అయితే సైలెంట్ కిల్లర్‌గా పిలిచే కట్లపాము విషం ఎంత ప్రమాదకరమో ఆయన ఊహించలేకపోయారు.
కాటు వేసిన గంట తర్వాత శరీరంలో విషం పాకడంతో మొహిద్దీన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కంగారుపడిన స్నేహితులు ఆయనను వెంటనే మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి ఇంజక్షన్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. మరో రెండు గంటల తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ అక్కడికి చేరిన కొద్దిసేపటికే మొహిద్దీన్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

