Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చౌట్కూరులో ఘనంగా మొహరం వేడుకలు

చౌట్కూరులో ఘనంగా మొహరం వేడుకలు

వార్త 1 week ago

Choutkur Moharram Festivals: సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండల కేంద్రంలో లౌకికత్వానికి, హిందూ-ముస్లింల మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక మొహరం పండుగ వేడుకలు (Choutkur Moharram Festival 2026) గురువారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా ప్రారంభమయ్యాయి.

గ్రామంలోని బి ఫాతిమా పీర్ల ప్రతిష్ఠాపనతో మండల కేంద్రమంతా ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది.

వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన ప్రముఖ ముస్లిం సోదరులు మహమ్మద్ యాదుల్ తన సోదరులతో కలిసి 'బి ఫాతిమా పీర్లను' అత్యంత రమణీయంగా, సాంప్రదాయ పద్ధతిలో రంగురంగుల వస్త్రాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పీర్ల మసీదు చావిడిలో ఏర్పాటు చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.

పీర్ల మసీదు వద్ద భక్తుల మొక్కులు - అసైదుల ఆటలు

మొహరం సంబరాల ప్రారంభాన్ని పురస్కరించుకుని స్థానిక పీర్ల మసీదు ఆవరణకు మహిళలు, యువకులు, ముస్లిం పెద్దలు మరియు హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కులమతాల భేదం లేకుండా అందరూ కలిసి పీర్ల సాక్షిగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు పీర్ల వద్దకు చేరుకుని నిప్పుల గుండాల సాక్షిగా తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం విలసిల్లాలని భక్తితో ప్రార్థించారు.

ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక సర్పంచ్ పార్కల రామ్‌రెడ్డి దంపతులు ప్రత్యేకంగా విచ్చేసి పీర్లను దర్శించుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పీర్లకు 'కుడుకలు' (ఎండు కొబ్బరి) సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చౌట్కూరు గ్రామం మొదటి నుండి సామాజిక ఐక్యతకు మారుపేరని, అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ పండుగను జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాత్రి వేళల్లో గ్రామ యువకులు, పెద్దలు కలిసి పీర్ల చావిడి వద్ద డప్పుల నాదాలు, భక్తిగీతాల మధ్య సాంప్రదాయ 'అసైదుల ఆటలు' (మొహరం జానపద నృత్యాలు) ఆడుతూ పండుగ ఉత్సాహాన్ని అంబరాన్నంటించారు.

Choutkur Moharram Festivals: నేడు గ్రామంలో పీర్ల ఊరేగింపు - శరబత్ ప్రసాద వితరణ

మొహరం వేడుకల్లో భాగంగా నేడు శుక్రవారం ఉదయం చౌట్కూరు ప్రధాన వీధుల గుండా పీర్ల భారీ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో భక్తులు తమ మొక్కుల ఉత్సవంలో భాగంగా బెల్లం, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా తయారు చేసిన పవిత్ర 'శరవత్' (తీపి పానీయం)ను పీర్లకు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. అనంతరం, మసీదు కమిటీ నిర్వాహకులు భక్తులందరికీ పవిత్ర లడ్డూ, మలీదా ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ మొహరం సంబరాల నేపథ్యంలో చౌట్కూరు మండల కేంద్రంలో భక్తి, సంప్రదాయం మరియు సామరస్య వాతావరణం వెల్లివిరిసింది.

Epaper: epaper.vaartha.com

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం.. ఈసారి 69 అడుగుల మహా గణనాథుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha