Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం.. ఈసారి 69 అడుగుల మహా గణనాథుడు

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం.. ఈసారి 69 అడుగుల మహా గణనాథుడు

వార్త 1 week ago

Khairatabad Ganesh: హైదరాబాద్ నగరిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతి నవరాత్రి వేడుకలకు అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం గణేశ్ మండపం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కర్ర పూజ (కర్ర ప్రతిష్ఠ) నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంతో వినాయక విగ్రహ నిర్మాణ పనులు అధికారికంగా మొదలయ్యాయి. ఈ ఏడాది ఖైరతాబాద్ ఉత్సవాలు 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. స్వామివారి విగ్రహ నమూనా (పోస్టర్)ను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి ఆవిష్కరించారు.

పంచభూతాలకు ప్రతీకగా ఐదు ముఖాలు.. పూర్తి మట్టి విగ్రహం!

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి 'శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి' అవతారంలో భక్తులకు నయనానందకరం చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా పూర్తిగా మట్టితోనే 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో, ఎనిమిది చేతులతో పద్మాసనంపై స్వామివారు ఆసీనులై ఉండేలా శిల్పులు రూపకల్పన చేశారు. వినాయకుడి ఐదు ముఖాలు పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) విశిష్టతను చాటిచెప్పనున్నాయి.

Khairatabad Ganesh: ఇరువైపులా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత నమూనాలు

ఈ సంవత్సరం మహాగణపతి విగ్రహానికి ఇరువైపులా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేక ఆకర్షణలు సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి కుడివైపున 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన సోమనాథ్ జ్యోతిర్లింగ నమూనాను, ఎడమవైపున అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాళికామాత దివ్య రూపాన్ని కొలువుదీరుస్తున్నారు. ఇది భక్తులకు మరింత ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది.

82 రోజుల్లో నిర్మాణం పూర్తి.. 100 మందికి పైగా కళాకారుల శ్రమ

సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ ఉన్నందున, రాబోయే 82 రోజుల్లోగా ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా నిపుణులైన కళాకారులు రేయింబవళ్లు శ్రమించి ఈ రూపాన్ని ఆవిష్కరించనున్నారు. 1954వ సంవత్సరంలో కేవలం ఒక అడుగు ఎత్తుతో మొదలైన ఖైరతాబాద్ గణపతి ప్రస్థానం.. నేడు ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

Epaper: epaper.vaartha.com

ఓటర్ నమోదుపై హరీష్ రావు కీలక ప్రకటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha