Kolusu Parthasarathy: ఇటీవల రహదారి ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన దుబ్బ దానయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నాయకులు అన్నివిధాలా అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష స్పష్టం చేశారు.
ఈ నెల 10వ తేదీన జరిగిన మోటారు బైక్ ప్రమాదంలో దుబ్బ దానయ్య మృతి చెందిన నేపథ్యంలో బుధవారం పలాసలోని మృతుడి నివాసానికి వెళ్లిన మంత్రి, ఇచ్చాపురం, పలాస శాసన సభ్యులు బాధితులను స్వయంగా పరామర్శించి తీవ్ర సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారిలో ధైర్యం నింపారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే పార్టీ స్పందించి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఆర్థిక సాయానికి అదనంగా, బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ తండ్రి, మాజీ పార్లమెంట్ సభ్యులైన కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి రూ.2 లక్షలు, యాదవ సంఘం నుండి రూ.3 లక్షలు ఈ ఐదు లక్షల రూపాయలు పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.

న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న ప్రభుత్వం
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ “నేను కూడా ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచే వచ్చి, భగవంతుని, సమాజపు ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నట్లు చైప్పారు. సోదరి గౌతు శిరీష వ్యక్తపరిచిన ఆవేదనను, బాధను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఒక సెంట్ భూమి కూడా లేకుండా, కూలీతో బతుకుతున్న ఒక నిరుపేద కుటుంబంలో ప్రమాదం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. ఇక్కడికి వచ్చి, నిరుపేద కుటుంబం గురించి కనీస ప్రస్తావన చేయకుండా, ప్రమాదం చేసి మరణానికి కారణమైన 18 సంవత్సరాలు నిండిన మేజర్ యువకుడి గురించి మాట్లాడారంటే, ఆ పార్టీ డిఎన్‌ఏ ఎటువంటిదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి” అని ఘాటుగా విమర్శించారు.
బాధిత కుటుంబ ఎదుర్కొంటున్న పరిస్థితులను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కొలుసు పార్థసారథి.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, ఘటనకు కారకులైన వారు ఎంతటి ప్రాభవం ఉన్నవారైనా చట్టం ముందు సమానులేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పునరుద్ఘాటించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

