CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై రాజుకున్న రాజకీయ రగడ మరింత తీవ్రరూపం దాల్చింది.
కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భారత ప్రధానమంత్రిని టెర్రరిస్టు అని సంబోధిస్తూ దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్మే ఇరామీ మజ్దానీ వంటి శక్తులను కలవడానికి ముఖ్యమంత్రి ఎందుకు ప్రయత్నించారని ఆయన నిలదీశారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టను దిగజార్చే వ్యక్తులతో సీఎం స్థాయి వ్యక్తి సమావేశమవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విధివిధానాల ప్రకారమే అనుమతి తిరస్కరణ: హామీల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించే కుట్ర!
ఈ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని, విదేశాంగ శాఖ నిబంధనలు మరియు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారమే అనుమతి లభించలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం కానీ, కక్షసాధింపు చర్యలు కానీ లేవని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత మరియు నిరసనల నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై అనవసర నిందలు వేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

