Devansh Pushkar Ghat: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది (2027) జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి వద్ద నిర్మిస్తున్న ఒక పుష్కర ఘాట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేష్ కుమారుడైన ‘దేవాన్ష్’ పేరు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన దేవాన్ష్ బోర్డుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు.
Don’t name any ghat after Devansh.. Minister Lokesh
Devansh Pushkar Ghat: తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్.. బోర్డు తొలగింపునకు ఆదేశాలు
ఈ వివాదం కాస్తా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. ప్రభుత్వ ఘాట్‌కు తన కుమారుడి పేరు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ఏ పుష్కర ఘాట్‌కు కూడా ‘దేవాన్ష్’ పేరు పెట్టకూడదని, వెంటనే ఆ బోర్డును తొలగించాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ మంత్రి లోకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మునికూడలిలో ముమ్మరంగా పుష్కర ఏర్పాట్లు
అంతకుముందు మునికూడలిలోని ఈ ఘాట్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఈ ఘాట్‌ను రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ‘మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 49 మీటర్ల ఘాట్‌ను భక్తుల రద్దీని తట్టుకునేలా 84 మీటర్లకు పెంచాలని అధికారులను ఆదేశించారు. గోదావరి హారతి, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం 5 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక విభాగాన్ని నిర్మించనున్నారు. గోదావరి పుష్కరాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఈ ఘాట్ ప్రధాన కేంద్రం కానుంది.
ఇందుకోసం తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, అన్నదాన కేంద్రాలు, భారీ పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు ఫైరింజన్లు, రెండు ప్రత్యేక వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నారు. గోదావరికి వరదలు రాకముందే ఈ పనులన్నింటినీ పూర్తి చేసి, ఈ నెల 24న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించే నాటికి ఘాట్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే లోకేష్ ఆదేశాలతో అధికారులు అక్కడ దేవాన్ష్ పేరును మార్చే ప్రక్రియను చేపట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

