MP Dharmapuri Aravind: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ రచ్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన సాగించడం చేతకాకపోతే రేవంత్ రెడ్డి తక్షణమే తన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
Dharmapuri Aravind
Read also: Revanth Reddy: ఏపీతో నీటి చర్చలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: అర్వింద్ మండిపాటు
బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధాన్యం కుప్పలు పోస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అరవింద్ ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇప్పుడు ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసేందుకు చూస్తోందని విమర్శించారు.
“రాష్ట్రంలో అక్రమ ఇసుక, మొరం రవాణా చేయడానికి లారీలు, ట్రాక్టర్లు పుష్కలంగా దొరుకుతాయి కానీ.. పాపం అన్నదాతల ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి మాత్రం ప్రభుత్వానికి లారీలు దొరకవా?” అంటూ అరవింద్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)కి ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడి ఉందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
‘ఫ్యూచర్ సిటీ’పై ఘాటు విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై కూడా బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సమస్యలను పరిష్కరించడం చేతకాని పాలకులు, కొత్త నగరాల గురించి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరుద్యోగ భృతి హామీ, పల్లెల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ హక్కుల కోసం కేంద్రం ముందు సరైన వాదనలు వినిపించలేదని, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అర్వింద్ దుయ్యబట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

